పుష్పక్.. పరిమళ్ నౌకలు హర్ముజ్ జలసంధిని దాటేలా ఇరాన్ సాయం
భారత విదేశాంగ విధానం మీద పలువురు విమర్శలు చేస్తుంటారు. అదో లోపాల పుట్టగా అభివర్ణించేవారు లేకపోలేదు.
By: Garuda Media | 10 March 2026 9:00 PM ISTభారత విదేశాంగ విధానం మీద పలువురు విమర్శలు చేస్తుంటారు. అదో లోపాల పుట్టగా అభివర్ణించేవారు లేకపోలేదు. ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకోవటం ద్వారా ఆప్తమిత్రులను పెద్ద ఎత్తున సంపాదించొకోవచ్చన్న సలహాలు ఇస్తుంటారు. కానీ.. ఆ మాటల్లో నిజం లేదని.. ఇప్పటివరకు అనుసరిస్తూ వస్తున్న విధానమే అత్యుత్తమమైనదన్న విషయం తాజాగా రుజువైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే సమయంలో ఇరాన్ - అమెరికా - ఇజ్రాయెల్ ముగ్గురు కలిసి భారత్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయం చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఉప్పు.. నిప్పులా ఉన్న పరిస్థితుల్లో.. అందుకు భిన్నంగా భారత్ విషయంలో అన్ని మినహాయింపులే అన్న భావన కలిగేలా చేయటంలో విశేషం. ఇంతకూ ఆ విజయం ఏమిటి? అదెలా సాధ్యమైంది? అంతర్జాతీయంగా భారత దౌత్య విధానంపై మరోసారి ప్రశంసల జల్లు కురవటం విశేషం.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ ముడిచమురు రవాణాకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని నిలిపేయటం తెలిసిందే. ఇరాన్ అధీనంలో ఉండే ఈ ఇరుకైన జలసంధి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నౌకలు ఆగిన పరిస్థితి. ఇలాంటి వేళ.. భారత్ అనుసరించిన టెలిఫోన్ డిప్లొమసీకి సానుకూల స్పందన రావటమే కాదు..భారత్ కోరినట్లుగా సదరు జలసంధి నుంచి భారత యాజమాన్య హక్కుల్లో ఉండే రెండు నౌకల (పరిమళ్, పుష్పక్) కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హార్ముజ్ జలసంధించిన విజయంతంగా దాటించారు.
నిజానికి ఈ రెండు నౌకలు వేరే దేశాల జెండాల కింద నమోదయ్యాయి. కానీ.. వీటిలో పని చేసే సిబ్బంది.. ఈ నౌకలు భారత్ కు చెందినవి. పుష్పక్ ‘కుక్ ఐలాండ్స్’ జెండాతో ప్రయాణిస్తే.. పరిమళ్ ‘పలావు’ దేశ జెండాతో నమోదై ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్ -ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. మనకు చెందిన ఈ రెండు నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు నిల్వ కేంద్రాల నుంచి బయలుదేరాయి. ఈ రెండు నౌకల్లో భారీ ఎత్తున ముడిచమురు.పెట్రోలియం ఉత్పత్తులు వస్తున్నాయి. నిజానికి మన దేశానికి చెందిన రెండు నౌకలు బయలుదేరే నాటికి సుమారు 300 నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోగా.. భారత్ చెందిన రెండు నౌకల్ని ఇరాన్ సిబ్బంది దగ్గరుండి.. సురక్షితంగా హుర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటించేశారు.
ప్రస్తుతం ఈ రెండు నౌకలు ఒమన్ గల్ఫ్ మీదుగా అరేబియా సముద్రం ద్వారా భారత్ కు వస్తున్నాయి. ఇందులో పరిమళ్ గుజరాత్ లోని వడినార్ ఓడరేపుకు చేరుకోనుంది. అదే సమయంలో పుష్పక్ నౌక కర్ణాటకలోని మంగళూరు లేదంటే గుజరాత్ లోని ముంద్రా రేవుల్లో ఏదో ఒక దానికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ రెండు నౌకలు ఒక్కొక్కటి కనిష్ఠంగా 7 లక్షల బ్యారెళ్లు.. గరిష్ఠంగా 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకొచ్చే సామర్థ్యం వీటి సొంతం. ఇక ఈ రెండు నౌకల ద్వారా వచ్చిన ముడిచమురు.. పెట్రోలియం ఉత్పత్తులు విలువ దగ్గర దగ్గర రూ.1200 - రూ.1600కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారత దౌత్యవిజయం అన్న మాట ఎందుకంటే.. హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటటంలో ఇరాన్ సాయం చేస్తే.. అమెరికా.. ఇజ్రాయెల్ వాటిని ఏదోలా ఇబ్బంది పెట్టొచ్చు.కానీ.. భారత్ కు ఈ మూడు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో తీవ్రమైన ఉద్రిక్తల మధ్య ఈ మూడు దేశాలు.. భారత్ కు చెందిన రెండు నౌకలకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం అంతర్జాతీయ సమాజాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ రెండు నౌకలు భారత్ కు చేరుకున్నంతనే మన నిల్వల్ని స్థిరీకరించే వీలు ఉంటుంది.
ఇంతకూ ఈ మొత్తం ప్రక్రియ సక్సెస్ కావటంలో కీలకంగా వ్యవహరించిన తెర మీద కనిపించే ప్రముఖుల విషయానికి వస్తే..
- భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- అనిల్ దేవ్లీ (ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ సీఈవో)
- కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్
మన రెండు నౌకల్ని హార్ముజ్ జలసంధిని క్షేమంగా దాటించేందుకు ముందుగా ఇరాన్ తో మాట్లాడిన భారత్.. ఆ తర్వాత ఇజ్రాయెల్, అమెరికాతోనూ మాట్లాడింది. అందరి నుంచి స్పష్టమైన హామీని పొందిన తర్వాత రెండు నౌకలు జలసంధిని దాటేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నౌకలకు సంబంధించిన ఎలాంటి మిస్ కమ్యునికేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో భారతీయ అధికారులు ఎంతో కీలకంగా వ్యవహరించారని చెప్పాలి.
