భారత డిజిటల్ ప్రకటన మార్కెట్ రేంజ్ చెప్పిన రిపోర్టు
2030 నాటికి ఈ మార్కెట్ ఏకంగా రూ.111 లక్షల కోట్లను దాటుతుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఇంతలా వచ్చే ఆదాయంలో ఎవరికి ఎక్కువగా వెళుతుందన్నది చూస్తే.. మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
By: Garuda Media | 18 April 2026 1:00 PM ISTచేతిలో మొబైల్. అందులో యూట్యూబ్.. ఇన్ స్టా.. ఫేస్ బుక్.. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంతో పాటు.. అమెజాన్ లాంటి సంస్థలు ఉన్నాయి. సోషల్ మీడియా పేరుతో ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నట్లు కనిపించే ఇందులో ఎంత భారీగా డబ్బులు ఉన్నాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే రిపోర్టు తాజాగా ఒకటి వచ్చింది. భారతదేశంలోని ప్రముఖ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థల్లో ఒకటిగా పేరున్న రెడ్ సీర్ సంస్థ.. 2009లో బెంగళూరులో అనిల్ కుమార్ స్థాపించారు. ఇంటర్నెట్ ఎకానమీ వినియోగదారుల ప్రవర్తన.. కొత్త తరం టెక్నాలజీ రంగాలపై పట్టు ఉన్న ఈ సంస్థ.. డిజిటల్ వ్యూహాలు.. మార్కెట్ పరిశోధన.. ఇన్వెస్ట్ మెంట్ అనలిటిక్స్ లాంటి సేవల్ని అందిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ సంస్థ ఒక రిపోర్టును వెల్లడించింది. ఇందులో భారతదేశంలోని డిజిటల్ ప్రకటనల వ్యాపారం ఎంత పెద్దదన్న విషయాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. గత ఏడాది నాటికి సుమారు రూ.1.01లక్షల కోట్లుగా భారత డిజిటల్ యాడ్ మార్కెట్ ఉందని పేర్కొంది. ప్రతి ఏటా 10-15 శాతం వ్రద్ధితో వెళుతున్న ఈ రంగం రానున్న ఐదేళ్ల కాలంలో రూ.2.03 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సాధారణ ఆర్థిక వ్యవస్థ వ్రద్ధి రేటు కంటే డిజిటల్ ప్రకటన వ్యయం అత్యంత వేగంగా పెరుగుతున్న అంశాన్ని రిపోర్టు ప్రస్తావించింది.
2025లో ప్రపంచ వ్యాప్తంగా ప్రకటన వ్యయంలో డిజిటల్ రంగం వాటా 70-75 శాతం ఉందని తెలిపిన రిపోర్టు.. ప్రపంచ జీడీపీ వ్రద్ధి రేటు కంటే 3-5 రెట్లు అధిక వేగంతో పెరుగుతున్నట్లుగా పేర్కొంది. 2025లో ప్రపంచ డిజిటల్ ప్రకటన వ్యయంలో 46 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 24 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత వాటా ప్రస్తుతం 1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
2030 నాటికి ఈ మార్కెట్ ఏకంగా రూ.111 లక్షల కోట్లను దాటుతుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఇంతలా వచ్చే ఆదాయంలో ఎవరికి ఎక్కువగా వెళుతుందన్నది చూస్తే.. మరింత ఆసక్తికరంగా ఉంటుంది. రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం గూగుల్ (యూట్యూబ్), మెటా (ఫేస్ బుక్, ఇన్ స్టా) ప్రకటనల ఆదాయంలో సుమారు 60శాతం వాటాతో డిజిటల్ మార్కెట్ లో అగ్రస్థానంలో నిలిచాయి.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి రిటైల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు తమ వాటాను 18-20 శాతం పెంచుకుంటూ గట్టి పోటీ ఇవ్వటం గమనార్హం. షార్ట్-ఫామ్ వీడియోలు భవిష్యత్తులో వృద్ధిని సూచిస్తున్నట్లుగా రిపోర్టు పేర్కొంది. డిజిటల్ ప్రకటనల్లో 65 శాతం కంటే ఎక్కువ వాటా కేవలం మొబైల్ ఫోన్ల ద్వారానే రావటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం ప్రకటనలు ఇప్పుడు పోగ్రామాటిక్ పద్దతిలోనే సాగుతున్నట్లుగా తెలిపింది.
ఈ-కామర్స్, గేమింగ్..షార్ట్ ఫామ్ వీడియో ప్లాట్ ఫారమ్ లు ఈ ప్రకటనల వృద్ధికి కారణాలుగా పేర్కొంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బ్రాండ్ లు తమ సమాచారాన్ని అందరికి కాకుండా డేటా విశ్లేషణ ద్వారా.. టార్గెటింగ్ వినియోగదారుడికి చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా పేర్కొంది. రాబోయే కాలంలో ఏఐ ఆధారిత క్యాంపెయిన్ లు.. ప్రకటనల మార్కెట్ ను శాసించే అవకాశం ఉందని రిపోర్టు వెల్లడించింది. చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ రిపోర్టును చూస్తే అర్థం కాక మానదు.
