వీగేలా చేశారు సరే.. పద్దతి ప్రకారం చేయాలంటే ఎంత కాలం పడుతుంది?
ఇదంతా చూస్తే.. గతంలో జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి కనీసం 3 నుంచి 5 ఏళ్ల కాలం పడుతుంది.
By: Garuda Media | 18 April 2026 12:00 PM ISTఅనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అన్నట్లుగా మారింది పరిస్థితి. డీలిమిటేషన్ విషయంలో మోడీ సర్కారు అనుసరించిన అస్పష్టత వైఖరితో ఒక మంచి అవకాశాన్ని..దక్షిణాదిని వెంటాడుతున్న ముప్పును తొలగించే అవకాశం చేజేతులారా పోయిన పరిస్థితి. దక్షిణాదికి నష్టం జరుగుతుందని పెద్ద పెద్ద మాటలు చెప్పిన దక్షిణాది ప్రముఖులే.. తమ తీరుతో దక్షిణాదికి నష్టం చేసేలా వ్యవహరించారా? అంటే కొంత మేర అవునని చెప్పక తప్పదు. ఇందులో విపక్షం పాత్ర ఎంత ఉందో.. మోడీ సర్కారు బాధ్యత కూడా అంతే ఉంది.
గుట్టుగా.. అసలు వివరాల్ని వెల్లడించకుండా..తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించటం మోడీ సర్కారు తప్పు అయితే.. తమకున్న భయాందోళనలు.. సందేహాలు.. మోడీ సర్కారు వ్యవహరించే తీరు.. తమ ప్రయోజనాలు తప్పించి..మరెవరి రాజకీయ ప్రయోజనాల గురించి మోడీషాలు ఆలోచించరన్న అనుమానాలు వెరసి.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేశాయని చెప్పాలి.
జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ జరగాలంటే.. మోడీ సర్కారు అనుసరించిన విధానంలో కాకుండా.. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాసెస్ యథాతథంగా జరగాలంటే ఏమేం చేయాలి? అందుకు ఎంతకాలం పడుతుంది? అన్నది ఆసక్తికర అంశం. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. అదేమంటే.. శుక్రవారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మూడొంతుల రెండు వంతుల మెజార్టీతో పాస్ అయి ఉంటే.. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అమల్లోకి రావటమే కాదు.. అటు లోక్ సభలోనూ.. ఇటు అసెంబ్లీలలోనూ ఎంపీలు.. ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరిగేది. కానేీ.. వీగిన కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి వేళ.. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా ప్రాసెస్ (పద్దతి) ప్రకారం ముందుకు వెళితే.. ఎంత సుదీర్ఘ ప్రక్రియ ఉందో అర్థమవుతుంది.
రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా డీలిమిటేషన్ ప్రక్రియ సాగాలంటే..తొలుత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. ఇందుకోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి ఒక స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేస్తారు. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఈ కమిషన్ రంగంలోకి దిగి రాష్ట్రాల వారీగా జనాభా లెక్కలను పరిశీలించి.. నియోజకవర్గాల సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది. దీనిపై ప్రజల అభ్యంతరాల్ని స్వీకరిస్తుంది. అనంతరం గెజిట్ విడుదల చేస్తుంది.
ఇదంతా చూస్తే.. గతంలో జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి కనీసం 3 నుంచి 5 ఏళ్ల కాలం పడుతుంది. అంటే.. 2026లో రాజ్యాంగ సవరణకు ఆమోదం లభించేందుకు పార్లమెంటులో బిల్లు ఆమోదంతో పాటు.. రాష్ట్రాల ఆమోదం జరగాలి.ఒకవేళ 2026లోనే దాన్ని పూర్తి చేశారని భావిద్దాం.అప్పుడు జనాభా లెక్కల సేకరణను పూర్తి చేయాలి. అందుకు మరో ఏడాది పడుతుంది. అది పూర్తయ్యాక డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. అది 2027 మధ్యలో జరిగిందని అనుకుందాం. రాష్ట్రాల వారీగా సరిహద్దులు గుర్తించి.. ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయటానికి కనీసం 2029 వరకు పుడుతుంది. అప్పుడు ప్రజలాభిప్రాయ సేకరణతో పాటు రాజకీయ పార్టీల అభ్యంతరాల్ని స్వీకరించాల్సి ఉంటుంది. అందుకు మరో ఏడాది సమయం పడుతుంది.
ఇదంతా విజయవంతంగా... ఎలాంటి వివాదాలు లేకుండా సాగితే.. రాష్ట్రపతి ఆమోదం పొంది.. చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ అయ్యే వీలు ఉంటుంది. అదంతాజరిగే నాటికి 2031 పక్కాగా అవుతుంది. అప్పుడు.. కొత్త సీట్లతో మొదటి సార్వత్రిక ఎన్నికల అమలు 2031 లేదంటే 2034 ఎన్నికల నుంచి షురూ అవుతుంది. శుక్రవారం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టటం.. విపక్షాల కారణంగా తీర్మానం వీడిన నేపథ్యంలో.. ప్రభు్వం మరిన్ని చర్చలు జరపాల్సి ఉంటుంది. లేదంటే.. కొత్త ప్రతిపాదనతో రావాల్సి ఉంటుంది. అదే జరిగి.. మరికొంత టైం పడితే..ఇప్పుడు వేసిన లెక్క మరింత మారుతుంది. అప్పుడు కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగానికి మరింత ఆలస్యం కావటం ఖాయం. అంటే.. శుక్రవారం వీగిన బిల్లుతో.. మొత్తం ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి షురూ కావాల్సి ఉంటుంది. ఇలాంటి వేళ.. మోడీ సర్కారు ఎలాంటి తీరును ప్రదర్శిస్తుందన్నది చూడాలి.
