Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో రెండు దేశాలతో ఘర్షణలు..లక్ష కోట్లతో కేంద్రం గట్టి చర్యలు

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   5 July 2025 9:45 AM IST
ఐదేళ్లలో రెండు దేశాలతో ఘర్షణలు..లక్ష కోట్లతో కేంద్రం గట్టి చర్యలు
X

2020 జూన్‌లో చైనాతో గల్వాన్‌లో రగడ... ఆక్రమణకు దిగిన డ్రాగన్‌తో తీవ్ర స్థాయి ఘర్షణ.. ఈఏడాది పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌..! గత ఐదేళ్లలో ఇరుగుపొరుగుతో ఇదీ సంఘర్షణ. అటు ప్రపంచవ్యాప్తంగానూ పరిస్థితులు చాలా ఉద్రికత్తంగా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం అనే మాట తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతోంది.

వాస్తవానికి బంగ్లాదేశ్‌తోనూ భారత్‌కు సమస్యే. కాకపోతే,చైనా, పాకిస్థాన్‌లా మన దగ్గర తోక జాడించే ధైర్యం ఆ దేశానికి లేదు. వీటన్నిటి రీత్యా రక్షణ రంగపరంగా భారత్‌ అత్యంత పటిష్ఠం అయ్యేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక రక్షణ సామగ్రిని కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. వీటి వ్యయం రూ.లక్ష కోట్లు కావడమే ఇక్కడ ప్రధానం.

ఈ రూ.లక్ష కోట్లతో మూడు ప్రధాన, ఏడు చిన్న రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు రక్షణ శాఖ ఓకే చెప్పింది. వీటిలో ప్రత్యేక గూఢచారి విమానం, శీఘ్ర-ప్రతిచర్య వాయు రక్షణ క్షిపణులకు అధునాతన మైన్ స్వీపర్లు, నీటి అడుగున కూడా పనిచేసే స్వయంప్రతిపత్తి నౌకలు ఉన్నాయి. గతంలో రక్షణ శాఖ వీటికి ప్రాథమిక సమ్మతి తెలిపింది.

రూ.44 వేల కోట్లను కేవలం యుద్ధ నౌకల స్వదేశీ నిర్మాణ ప్రాజెక్టుకే వెచ్చించనుంది. పదేళ్లు పట్టనున్న ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకం. ఈ యుద్ధ నౌకలు శత్రు సైన్యం నీటి అడుగున ఏర్పాటు చేసిన గనులను సైతం గుర్తించి నాశనం చేస్తాయి. కాగా, భౌగోళికంగా సముద్రం పంచుకోకున్నా.. పాక్‌-చైనా మధ్య సముద్ర సహకారం బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత సముద్ర సరిహద్దులు, వాణిజ్య షిప్పింగ్‌ను కాపాడుకునేందుకు ఎంసీఎంవీలను అభివృద్ధి చేయనుంది.

రెండో ప్రధాన ప్రాజెక్టులో డీఆర్డీవో అభివృద్ధి చేసిన రూ.36 వేల కోట్ల శీఘ్రంగా ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఉంది. సైన్యం కోసం మూడు రెజిమెంట్లు, వైమానిక దళం కోసం మూడు స్క్వాడ్రన్లు ఉంటాయి.

3వ ముఖ్యమైన ప్రాజెక్ట్ రూ.10 వేల కోట్ల విలువైన మూడు ఇంటెలిజెన్స్, నిఘా, లక్ష్య సముపార్జన, నిఘా విమానాల సేకరణ. సింథటిక్ ఎపర్చర్ రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ సిస్టమ్‌ల వంటి డీఆర్డీవో అభివృద్ధి చేసిన స్వదేశీ సెన్సార్‌లతో ఉన్న ఈ విమానాలు, యుద్ధ విమానాలు, క్షిపణుల ద్వారా విలువైన శత్రు భూ లక్ష్యాలను కచ్చితంగా చేధిస్తాయి.