Begin typing your search above and press return to search.

ఒకప్పటి దిగుమతిదారు.. నేడు గ్లోబల్ డిఫెన్స్ లీడర్.. రక్షణ ఎగుమతుల్లో భారత్ నూతన శకం

తాజా ఎగుమతులు రూ.38,424 కోట్లు, వృద్ధి శాతం అద్భుతమైన 62.66% వృద్ధిగా నమోదైంది. ఒక దశాబ్దం క్రితం కేవలం రూ.700 కోట్ల స్థాయిలో ఉన్న భారత రక్షణ ఎగుమతులు..

By:  A.N.Kumar   |   16 July 2026 6:55 PM IST
ఒకప్పటి దిగుమతిదారు.. నేడు గ్లోబల్ డిఫెన్స్ లీడర్.. రక్షణ ఎగుమతుల్లో భారత్ నూతన శకం
X

ఒకప్పుడు ప్రపంచ దేశాల నుంచి రక్షణ సామగ్రిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారతదేశం.. నేడు ప్రపంచ దేశాల రక్షణ భారాలను తన భుజాలపై వేసుకునే స్థాయికి ఎదిగింది. 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' నినాదాలతో స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేసిన భారత రక్షణ రంగం, ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నిన్నటి వరకు కొనుగోలుదారుగా ఉన్న భారత్.. నేడు ప్రపంచ మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన ఆయుధ విక్రేతగా అవతరించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పరిణామం.

రికార్డుల సునామీ.. రూ.38 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు

గడచిన కొన్నేళ్లలో భారత రక్షణ రంగం సాధించిన ప్రగతి అసాధారణమైనది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. మరోవైపు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి.. 2024-25 ఎగుమతులు రూ.23,622 కోట్లు,

తాజా ఎగుమతులు రూ.38,424 కోట్లు, వృద్ధి శాతం అద్భుతమైన 62.66% వృద్ధిగా నమోదైంది. ఒక దశాబ్దం క్రితం కేవలం రూ.700 కోట్ల స్థాయిలో ఉన్న భారత రక్షణ ఎగుమతులు.. నేడు దాదాపు 50 రెట్లు పెరగడం దేశ పారిశ్రామిక, సాంకేతిక శక్తికి నిదర్శనం.

ప్రపంచ దేశాల రక్షణ కవచంగా 'బ్రహ్మోస్'

భారత రక్షణ ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచింది 'బ్రహ్మోస్' సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయంగా భారీ పోటీ నెలకొంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా భారత్‌తో ఇండోనేషియా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయగా ఇప్పుడు ఇండోనేషియా మూడో దేశంగా చేరింది. సుమారు 200 నుంచి 630 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందంలో క్షిపణి బ్యాటరీలు, తీరప్రాంత రక్షణ వ్యవస్థలతో పాటు భారత సైన్యం అందించే ప్రత్యేక శిక్షణ కూడా భాగం కావడం విశేషం.

పినాక, ఆకాశ్.. అంతర్జాతీయ వేదికపై మన బ్రాండ్లు

కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా భారత్ తయారు చేసిన ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అర్మేనియా దేశం వేల కోట్ల రూపాయల విలువైన పినాక వ్యవస్థలను కొనుగోలు చేయగా ప్రస్తుతం శక్తివంతమైన ఐరోపా దేశం ఫ్రాన్స్ కూడా ఈ వ్యవస్థపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తుండడం భారత్ సాంకేతికతకు దక్కిన అరుదైన గౌరవం.

ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..

శత్రువుల డ్రోన్లు, యుద్ధ విమానాలను గాల్లోనే తుత్తునియలు చేసే ఈ స్వదేశీ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశంగా అర్మేనియా రికార్డు సృష్టించింది.

ఇండో-పసిఫిక్‌లో భారత ఆయుధాల హవా

ప్రస్తుతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత ఆయుధాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలు తమ సరిహద్దుల రక్షణ కోసం భారత్ వైపే చూస్తున్నాయి. 2020-2025 మధ్య కాలంలో భారత మొత్తం రక్షణ ఎగుమతుల్లో ఈ మూడు దేశాల వాటాయే 70 శాతానికి పైగా ఉండటం గమనార్హం.

భవిష్యత్ లక్ష్యం: రూ.50,000 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న రక్షణ అవసరాల నేపథ్యంలో భారత రక్షణ రంగం మరిన్ని విజయాల వైపు దూసుకుపోతోంది. రక్షణ రంగ నిపుణుల అంచనాల ప్రకారం.. 2029 నాటికి భారత రక్షణ ఎగుమతులు రూ.50,000 కోట్ల మార్కును సులభంగా దాటనున్నాయి.

అగ్రరాజ్యాలకు దీటుగా అత్యాధునిక రక్షణ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచ భద్రతలో ఒక కీలక భాగస్వామిగా ఎదుగుతున్న భారతదేశ ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం..