ఏమిటీ నేరాలు.. ఘోరాలు.. చిన్న విషయాలకే ప్రాణాలు తీసుడా?
అవును.. దేశానికి ఏమైంది? ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న నేరాలు.. ఘోరాల్ని చూస్తే నోట మాట రాని పరిస్థితి.
By: Tupaki Desk | 4 July 2025 3:00 PM ISTఅవును.. దేశానికి ఏమైంది? ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న నేరాలు.. ఘోరాల్ని చూస్తే నోట మాట రాని పరిస్థితి. చిన్న విషయాలకు పగ పెంచుకొని ప్రాణాలు తీయటం.. లేదంటే ప్రాణాలు తీసుకోవటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇది ఒక ప్రాంతానికో.. ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి తీరు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఒకే రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగు చూసిన సంచలన దారుణాల్ని చూస్తే.. దేశంలో నేరాల తీరులోనే కాదు తీవ్రతలోనూ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు.
దేశ రాజధాని ఢిల్లీలో తల్లీబిడ్డల జంట హత్యలు షాక్ కు గురి చేసేలా మారాయి. ఈ జంట హత్యలకు కారణం మీద పోలీసులు విచారణ చేపట్టగా వెలుగు చూసిన విషయాలు నోట మాట రాని విధంగా ఉండటం గమనార్హం. ఢిల్లీలోని లజపత్ నగర్ లో కుల్ దీప్ సేవాని వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. అతడి దగ్గర బిహార్ కు చెందిన 24 ఏళ్ల ముకేశ్ కుమార్ డ్రైవర్ కం హెల్పర్ గా పని చేస్తుంటాడు.
కొంతకాలం క్రితం యజమాని వద్ద ముకేశ్ రూ.40 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో.. ఆగ్రహించిన కుల్ దీప్ సతీమణి రుచిక అందరి ముందు ముకేశ్ ను తిట్టింది. దీంతో కక్ష కట్టిన ముకేశ్.. యజమాని ఇంట్లో లేనప్పుడు ఇంటికి వెళ్లి రుచిక.. ఆమె పద్నాలుగేళ్ల కొడుకును కత్తితో గొంతు కోసి చంపాడు. షాప్ నుంచి ఇంటికి వచ్చిన కులదీప్.. గేటుకు తాళం వేసి ఉండటం.. మెట్లపై రక్తపు మరకలు చూసి కేకలు వేశాడు. ఎవరూ స్పందించకపోవటంతో పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ జంట హత్యలు కలకలం రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. యజమాని సతీమణి.. కొడుకును హత్య చేసిన ముకేశ్ పారిపోయాడు. అతడ్ని ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అరెస్టు చేశారు.దీంతో.. జరిగిన జంట హత్యల మిస్టరీ వీడిపోయింది.
సోషల్ మీడియాలో పోస్టులు.. వాదనలతో మనస్తాపం.. సూసైడ్
సోషల్ మీడియాలో పోస్టులు.. ఆపై జరిగిన వాదోపవాదాలు.. పోలీసుల ఎంట్రీ..మొత్తంగా ఒక మరణానికి కారణంగా మారాయి. ములుగు జిల్లాలోని చల్వాయి గ్రామానికి చెందిన 29 ఏళ్ల రమేశ్ హైదరాబాద్ లో ఉంటూ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతను ఇందిరమ్మ ఇళ్ల లబ్థిదారుల జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్నాడు. దీనిపై అధికారులు.. స్థానిక నేతల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో.. రమేశ్.. అతడి చెల్లెల్ని అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరిగాడు.
తమకు ఇంటిని కేటాయించకపోవటంతో గ్రామంలో ఎవరెవరికి ఇళ్లు వచ్చాయో తెలుసుకొని చల్వాయి సమాచారం అనే వాట్సప్ గ్రూపులో పోస్టు చేస్తున్నాడు. దీనిపై కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వివరాల్ని వాట్సాప్ గ్రూపులో పెట్టగా.. దీనిపై వాదోపవాదాలు జరిగాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. వారు రమేశ్ ను హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
డెలివరీ ఏజెంట్ మాదిరి వచ్చి రేప్
పుణె మహానగరంలో షాకింగ్ క్రైం చోటు చేసుకుంది. డెలివరీ ఏజెంట్ మాదిరి ఇంటికి వచ్చిన వ్యక్తి అందులో నివాసం ఉంటున్న 22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై రేప్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. కొంధవా ప్రాంతంలో రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన వ్యక్తి ఒంటరిగా ఉన్న ఐటీ ఉద్యోగరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
క్రైం జరిగిన తీరు చూస్తే.. బాధితురాలిని టార్గెట్ చేసుకొని.. ఆమెకు సంబంధించిన ప్రతి సమాచారాన్నిసేకరించినట్లుగా కనిపిస్తోంది. సోదరుడితో కలిసి ఉండే బాధితురాలు.. ఇంటి నుంచి ఆమె అన్న బయటకు వెళ్లిన తర్వాతే రావటం.. ఆమెపై అత్యాచారం చేయటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. బ్యాంకు డాక్యుమెంట్ లాంటిది చూపించి సంతకం చేయాలని బాధితురాలిని కోరగా.. పెన్ను కోసం ఇంట్లోకి వెళ్లగా.. ఇంటి గడియ పెట్టి ఆమెను రేప్ చేశాడు.
ఈ షాకింగ్ ఘటనతో స్ప్రహ కోల్పోయిన బాధితురాలు.. ఆ తర్వాత తనపై జరిగిన అత్యాచారాన్ని బంధువులకు తెలపటంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్ప్రహ కోల్పోయిన బాధితురాలి ఫోన్ తో నిందితుడు కొంచెం కనిపించేలా సెల్ఫీ దిగి.. ఆమె ఫోటోలు తాను తీశానని.. పోలీసులకు చెబితే వైరల్ చేస్తానని హెచ్చరించటంతో పాటు.. మళ్లీ వస్తానన్న సందేవాన్ని పెట్టి వెళ్లటం గమనార్హం. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
టీనేజర్ ను 8 మంది కలిసి హత్య చేశారు
దేశ రాజధాని ఢిల్లీలో పద్నాలుగేళ్ల బాలుడ్ని దారుణంగా హతమార్చిన ఉదంతం వెలుగు చూసింది. హత్యకు గురైన బాలుడు ఇన్ఫర్మార్ గా పని చేశాడన్న అనుమానంతో హత్య చేసినట్లుగా చెబుతున్నారు. టీనేజర్ దారుణ హత్యలో పాల్గొన్న ఎనిమిది మందిలో నలుగురు మైనర్లు కావటం సంచలనంగా మారింది.
హత్య అనంతరం బాలుడి డెడ్ బాడీని ఢిల్లీ శివారులో పడేశారు. హత్యకు ముందు బాలుడ్ని కిడ్నాప్ చేయటం. వివస్త్రుడ్ని చేసి.. అనంతరం హత్య చేశారు.ఈ ఉదంతంలో ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతోనే.. హత్య చేసింది ఎనిమిది మందని.. అందులో నలుగురు మైనర్లు అన్న విషయం బయటకు వచ్చింది.
స్కూల్లో తిట్టారని సూసైడ్ చేసుకున్న టీచర్
మహబూబాబాద్ జిల్లాలోని అవతాపురం గ్రామానికి చెందిన సంతోష్ కు ఝాన్సీకి పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కొడుకు.. కుమార్తె ఉన్నారు. ఝాన్సీ ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం స్కూల్లో జరిగిన మీటింగ్ లో ఝాన్సీ పని తీరును తప్పు పడుతూ.. గట్టిగా మందలించారు దీంతో.. తాను స్కూల్ కు వెళ్లనని.. జాబ్ మానేస్తానని భర్తకు చెప్పింది. స్కూల్లో తనను అనవసరంగా తిట్టారన్న వేదనతో ఆమె.. ఇంట్లో ఎవరూ లేని వేళలో ఊరివేసుకుంది.
ఈ సమాచారం తెలుసుకున్న ఆమె మామ 60 ఏళ్ల లక్ష్మణ్ గుండెపోటుకు గురై మరణించారు.గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో చోటు చేసుకున్న రెండు మరణాలు స్థానికంగా తీవ్ర విషాదానికి గురి చేశాయి.