భారత్ లో పాక్ బలగం వీరే... ఏమిటీ నెట్ వర్క్?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా భారత్ ప్రతీకార దాడుల తర్వాత భారత నిఘా సంస్థలు అత్యంత అప్రమత్తమయ్యాయి
By: Tupaki Desk | 31 May 2025 11:56 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా భారత్ ప్రతీకార దాడుల తర్వాత భారత నిఘా సంస్థలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో భారత్ లోని పాక్ బలగం బ్యాచ్ లను వేటాడం మొదలుపెట్టాయి. ఈ సమయంలో సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ కలిపి సుమారు 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అవును... భారత్ లో ఉంటూ, భారతీయులుగా ఉంటూ పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో.. గత నెలరోజుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలలో సుమారు 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు!
జ్యోతి మల్హోత్రా:
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కు ఐ.ఎస్.ఐ. కార్యకర్తలతో సంబధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆమెను ఈ నెలలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చెస్తున్న అధికారుల ప్రకారం... ఆమెకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లోని వ్యక్తులతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో.. ఆమె వారితో ఉన్న సంబంధాల మేరకు కనీసం రెండు సార్లు పాకిస్థాన్ ను సందర్శించినట్లు నిర్ధారించబడిందని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె డానిష్, షాహిద్, అహ్సాన్ అనే పాకిస్థాన్ నిఘా అధికారులతో సంభాషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆమె నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను పరిశీలించి ఆమెకు ఐ.ఎస్.ఐ.తో సంబంధంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది!
సహదేవ్ సింగ్ గోహిల్:
గుజరాత్ లోని కచ్ జిల్లా నివాసి సహ్దేవ్ సింగ్ గోహిల్.. కొత్తగా నిర్మించిన భారత వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళాలకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను ఒక విదేశీ ఏజెంట్ తో పంచుకున్నారనే ఆరోపణలపై అతనిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ఈ నెల ప్రారంభంలో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఈ క్రమంలో 2023లో వాట్సప్ ద్వారా తనను తాను అదితి భరద్వాజ్ అని చెప్పుకున్న వ్యక్తితో గోహిల్ కు పరిచయం ఏర్పడిందని సీనియర్ ఏటీఎస్ అధికారి తెలిపారు. అయితే... భరద్వాజ్ అనేది పాకిస్థాన్ నిఘాన్ సంస్థ ఉపయోగించే కవర్ ఐడెంటిటీ అని దర్యాప్తు అధికారులు విశ్వసిస్తున్నారు.
మోతీరామ్ జాట్:
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ప్రకారం.. 2023 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) లోని ఏ.ఎసై. గా పనిచేస్తున్న మోతీరామ్ జాట్ సంప్రదింపులు జరుపుతున్నాడు! రహస్య సమాచారన్ని అందజేసినందుకు అతడికి డబ్బులు ముట్టాయి! అవన్నీ జాట్ భార్య ఖాతాలో జమైనట్లు గుర్తించారని అంటున్నారు. ప్రస్తుతం ఇతడు ఎన్.ఐ.ఏ. కస్టడీలోనే ఉన్నాడు.
రవీంద్ర వర్మ:
మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్).. ముంబైకి చెందిన ఒక రక్షణ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న 27 ఏళ్ల రవీంద్ర వర్మను అరెస్ట్ చేసింది. సమాచారం ప్రకారం... యుద్ధనౌకలు, సబ్ మెరైన్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు విచారణలో వెల్లడైంది.
వర్మను హనీట్రాప్ లోకి నెట్టే పాకిస్థాన్ ఏజెంట్లకు పాయల్ శర్మ, ఇస్ప్రీత్ పేర్లతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్స్ లతో ముందస్తు వ్యూహాలు నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అతడు నావికాదళ ఆస్తుల గురించి వివరణాత్మక స్కెచ్ లు, రేఖాచిత్రాలు, ఆడియోనోట్ లను పంచుకోవడం ప్రారంభించాడని చెబుతున్నారు.
హర్యానాలో ముగ్గురు అరెస్ట్!:
హర్యానాలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకుని ఐ.ఎస్.ఐ. రిక్రూట్ మెంట్ కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాటియాలాకు చెందిన పాతికేళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి దేవేందర్ సింగ్ ధిల్లాన్.. తుపాకీల ఫోటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తర్వాత అరెస్ట్ చేయబడ్డాడు. అతను 2024 నవంబర్ లో పాక్ ను సందర్శించాడని, భారత సైనిక స్థావరల సున్నితమైన చిత్రాలను పంచుకున్నాడని దర్యాప్తులో తేలిందని అంటున్నారు.
ఇదే సమయంలోఈ... పానిపట్ లో 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ నౌమాన్ ఇలాహీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో.. అతను తన బావమరిది బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ఐ.ఎస్.ఐ. నిర్వాహకులకు సమాచారాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిసిందని.. సరిహద్దు దాటిన నగదు బదిలీలను అధికారులు నిర్ధారించారని అంటున్నారు.
ఇదే క్రమంలో... సుహ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల అర్మాన్, టారిఫ్ లను కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అతని నివాసానికి చేరుకున్న సమయంలో పాక్ ఫోన్ నెంబర్లతో ఉన్న చాట్ లను తొలగించడనికి ప్రయతిస్తున్న సమయంలో టారిఫ్ పట్టుబడ్డట్లు చెబుతున్నారు.
షాకుర్ ఖాన్:
జైసల్మేర్ కు చెందిన రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి 49 ఏళ్ల షాకుర్ ఖాన్ ను గూఢచర్య ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి షాలే మొహమ్మద్ కు పీఏగాను పనిచేశారు. ఖాన్ కనీసం ఏడు సార్లు పాకిస్థాన్ ను సందర్శించాడు. పాక్ తో అతని సంబంధాలను దర్యాప్తు సంస్థలు మరింతగా విచారిస్తున్నాయి.
షాజాద్:
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ ను మొరాదాబాద్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. ఇతడు పాకిస్థాన్ కు పలుమార్లు వెళ్లినప్పుడు హ్యాండ్లర్లతో నిఘా సమాచారం పంచుకున్నాడని.. పలు వినియోగ వస్తువుల అక్రమ రావాణాలోనూ పాల్గొన్నాడినట్లు తెలుస్తోంది!
మరిన్ని అరెస్టులు!:
ఇదే క్రమంలో రాజస్థాన్ లోని డీగ్ కు చెందిన 34 ఏళ్ల ఖాసిమ్.. భారతీయ మొబైల్ సిమ్ కార్డులను పాక్ కు సరఫరా చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అతడు ఆగస్టు 2024 - మార్చి 2025 మధ్య రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి, అక్కడ చాలా కాలం ఉన్నాడని అంటున్నారు.
