పాక్ లో మన ఐఏఎఫ్ పైలట్.. భారత్ భారీ ఆపరేషన్.. ఇంతకీ ఏం చేసిందంటే..!?
పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌తో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. 1947 విభజన నాటి మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వరకు ఆ దేశం కుయుక్తులను మానుకోలేదు.
By: Tupaki Political Desk | 16 April 2026 2:00 PM ISTపక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌తో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. 1947 విభజన నాటి మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వరకు ఆ దేశం కుయుక్తులను మానుకోలేదు. అయితే, భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికనే పంపింది. శత్రువు ఎంతటి క్రూరుడైనా.. మన జవాన్ల ప్రాణాలను కాపాడుకోవడంలో భారత్ ఇప్పుడు అమెరికా తరహా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
శత్రువు కోటలో సర్జికల్ రెస్క్యూ..
నయా భారత్ సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడడం లేదు. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని కోల్పోయిన తర్వాత, భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను ఊడ్చిపారేసింది. అయితే, యుద్ధ తంత్రం కేవలం శత్రువును చంపడమే కాదు.. ప్రమాదంలో ఉన్న మన సైనికులను కాపాడుకోవడం కూడా అని భారత్ ఇప్పుడు ప్రపంచానికి చెప్తోంది. ఇటీవల ఇరాన్-అమెరికా యుద్ధంలో అమెరికా పైలట్‌ను ఇరాన్ గడ్డపై నుంచి 36 గంటల్లో సురక్షితంగా వెనక్కి తెచ్చిన ‘కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ ఆపరేషన్ చూసిన తర్వాత, భారత్ కూడా తన సామర్థ్యాలను అదే స్థాయికి పెంపొందించుకుంటోంది.
అభినందన్ అనుభవం నుంచి..
2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ భూభాగంలో చిక్కుకున్నప్పుడు, మనం దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఆయన్ని వెనక్కి తెచ్చుకోగలిగాం. కానీ, అప్పట్లో మనకు అమెరికా తరహాలో మెరుపు రెస్క్యూ ఆపరేషన్ చేసే సాంకేతికత తక్కువగా ఉండేది. ఐఏఎఫ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా వివరించినట్లు, ఇప్పుడు భారత్ తన ‘ప్లే బుక్’ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఒకవేళ భారత పైలట్ శత్రువు గడ్డపై పడిపోతే, సెకన్ల వ్యవధిలోనే వారి వద్ద ఉండే ఎమర్జెన్సీ రేడియో సిగ్నల్స్ సాటిలైట్ ద్వారా మన కంట్రోల్ రూమ్‌కు చేరుతాయి. తద్వారా పైలట్ ఎక్కడున్నారో కచ్చితమైన లోకేషన్ తెలుస్తుంది.
గగనతలంలో రాఫేల్.. నేలపై గరుడ్..
ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది అత్యంత క్లిష్టమైంది. పైలట్‌ను తీసుకురావడానికి వెళ్లే హెలికాప్టర్లకు శత్రువుల నుంచి ముప్పు ఉండకుండా, ఆకాశంలో రాఫేల్ లేదా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు గస్తీ కాస్తాయి. ఏదైనా శత్రు విమానం లేదా మిసైల్ దాడికి ప్రయత్నిస్తే ఇవి అక్కడికక్కడే కూల్చివేస్తాయి. అదే సమయంలో ఐఏఎఫ్ కి చెందిన వీర కమాండోలు ‘గరుడ్’ ఈ ఆపరేషన్ లో ప్రాణాలకు తెగించి పాల్గొంటారు. శత్రువుల కళ్లు కప్పి పైలట్‌ను హెలీకాప్టర్‌లోకి ఎక్కించుకోవడం వీరి ప్రధాన బాధ్యత.
భారత్ వద్ద ఉన్న అత్యాధునిక వనరులు..
భారత్ ఈ ఆపరేషన్ కోసం అత్యున్నత స్థాయి ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకుంది.
ఎల్సీహెచ్ ప్రచండ్ (LCH Prachand): ఇది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో, మంచు కొండల్లో కూడా వేగంగా కదలగలదు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఇది రెస్క్యూ మిషన్‌లో పాల్గొంటుంది.
అపాచీ - చినూక్: అపాచీ హెలీకాప్టర్లు శత్రువులపై బాంబుల వర్షం కురిపిస్తూ రక్షణ ఇస్తుంటే, చినూక్ హెలీకాప్టర్లు భారీ ఎత్తున సైనికులను లేదంటే సామగ్రిని తరలిస్తాయి. ముఖ్యంగా రాత్రి కూడా ఇవి ఆపరేషన్ చేయగలవు.
సీ-130జే సూపర్ హెర్కులస్: గరుడ్ కమాండోలను సరిహద్దు దాటించి, నేరుగా శత్రువుల గుండెల్లోకి చేరవేయడంలో ఈ విమానం కీలకగా మారుతోంది. ఇది చిన్నపాటి రోడ్లపై కూడా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.
బుద్ధి మార్చుకోని దాయాది దేశం..
మనం ఎన్ని సర్జికల్ దాడులు చేసినా, పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. అందుకే భారత్ కేవలం రక్షణ వ్యవస్థనే కాదు, దాడి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది. ఎస్-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉండడం వల్ల పాక్ క్షిపణులు మనగడ్డను తాకడం అసాధ్యం. మరోవైపు బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణులు శత్రువు కోటలను క్షణాల్లో బూడిద చేయగలవు.
యూరేషియన్ టైమ్స్ కథనం ప్రకారం.., భారత్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ స్థాయి రక్షణ సామర్థ్యం ఉన్న దేశం. అమెరికా తన పైలట్ కోసం ఎలాగైతే ఇరాన్‌లో ఆపరేషన్ చేసిందో, రేపు అవసరమైతే పాకిస్థాన్‌లో కూడా భారత్ అలాంటి ‘హంట్ అండ్ రెస్క్యూ’ ఆపరేషన్ చేయగలదని విశ్లేషకులు చెబుతున్నారు. మన సైన్యం వద్ద ఉన్న ఆత్మవిశ్వాసం, ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక ఆయుధాలు చూస్తుంటే.. భారత్ ఏ శత్రువునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.
