ఎల్లుండి దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్.. వైమానిక దాడులను ఎదుర్కోవడానికి ప్రజలకు శిక్షణ!
పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది.
By: Tupaki Desk | 5 May 2025 9:12 PM ISTపాకిస్తాన్‌తో సరిహద్దుల్లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన దేశంలోని పలు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. శత్రు దేశాలు ఒకవేళ వైమానిక దాడులు గనుక చేస్తే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఎలాంటి సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలనే ముఖ్యమైన అంశాల మీద ప్రజలకు అనే ముఖ్యమైన అంశాలపై ప్రజలకు సమగ్రమైన అవగాహన కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ సివిల్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం వైమానిక దాడుల సమయంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడానికి ట్రైనింగ్ తప్పనిసరి. ఇందులో భాగంగా సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి, బాంబు షెల్టర్లు ఎక్కడ ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ మాక్ డ్రిల్‌లో సాధారణ ప్రజలతో పాటు స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది కూడా పాల్గొననున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ నెల 7న జరిగే మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజలందరూ ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొని తమ భద్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మాక్ డ్రిల్ కేవలం ఒక డెమో మాత్రమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రమాదానికైనా సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించడం అనేది ప్రజలను అప్రమత్తం చేయడంలో, వారికి సరైన శిక్షణ ఇవ్వడంలో ఒక ముఖ్యమైన చర్య. ఇది దేశ భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాక్ డ్రిల్‌ను జిల్లా, మండల స్థాయిల్లో విస్తృతంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.
