భారత్ కు అమెరికా తీవ్ర హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా అమెరికా నుంచి భారత్‌కు కీలక హెచ్చరిక అందింది.
By: Tupaki Desk | 2 July 2025 11:40 AM ISTరష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా అమెరికా నుంచి భారత్‌కు కీలక హెచ్చరిక అందింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే, భారత్, చైనా వంటి దేశాలపై 500 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ సెనేట్‌లో త్వరలోనే ఒక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
భారత్, చైనాల లక్ష్యంగా బిల్లు?
ఈ బిల్లు ముఖ్యంగా భారత్, చైనా దేశాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలులో భారత్ 70 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వని దేశాలు.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే, వారి ఎగుమతులపై 500% దిగుమతి సుంకాలు అమలు చేస్తామని గ్రాహం హెచ్చరించారు. ఇది అమలైతే భారత ఔషధాలు, వస్త్రాలు, ఇతర ఎగుమతి ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
-ఉక్రెయిన్‌కు మద్దతుగా సవరణలు
లిండ్సే గ్రాహం మాట్లాడుతూ రష్యాను ఆర్థికంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నామని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాలకు మాత్రం ప్రత్యేక వాణిజ్య సవరణలు, తగ్గిన సుంకాలు వంటి ప్రయోజనాలున్న ఒప్పందాలను కూడా ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.
-భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ స్పందన
మరోవైపు భారత్‌తో తక్కువ సుంకాల వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. "భారత్‌తో ఓ కొత్త డీల్ కుదుర్చుకోబోతున్నాం. అది చాలా తక్కువ సుంకాలతో ఉండే ఒప్పందం అవుతుంది. అయితే ఇప్పటివరకు భారత్ దానిని అంగీకరించలేదు. కానీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం" అని ఆయన చెప్పారు. ఈ ఒప్పందంపై జూలై 9 నాటికి రెండు దేశాలూ నిర్ణయానికి రావాలని చూస్తున్నాయని వర్గాలు తెలిపాయి.
అమెరికా తీసుకుంటున్న ఈ విధానాలు రష్యాపై ఒత్తిడిని పెంచేలా ఉంటే, మరోవైపు భారతదేశం వంటి దేశాలకు ఇది వాణిజ్య పరంగా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలపై ఈ క్లిష్టమైన సమయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. భారత ప్రభుత్వం రష్యాతో కొనసాగుతున్న చమురు ఒప్పందాలపై మౌనం వీడి, సమగ్ర దృష్టితో నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది.
