దలైలామా వారసుడి ఎంపిక.. భారత్ తో చైనా సమస్య ఏమిటంటేనంట..!
2020లో గల్వాన్ ఘటనతో భారత్ - చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు!
By: Tupaki Desk | 14 July 2025 4:00 AM IST2020లో గల్వాన్ ఘటనతో భారత్ - చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు! ఈ పర్యటనలో భాగంగా... చైనా విదేశాంగశాఖ మంత్రితో ఆయన చర్చలు జరిపే అవకాశముంది! ఈ నేపథ్యంలో దలైలామా వారసుడి ఎంపికలో భారత్ తో సమస్య అంశం తెరపైకి తెచ్చింది చైనా.
అవును... టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో భారత్ తో సంబంధాలలో ఓ సమస్యగా మారిందని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా.. భారత్ లోని కొంతమంది, దలైలామా వారసత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
ఇందులో భాగంగా... భారత విదేశాంగ నిపుణులు టిబెట్ కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని యు జింగ్ సూచించారు. దలైలామా పునర్జన్మ, వారసత్వం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని.. ఇందులో భారత్ కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చను లేవనెత్తాయని అంటున్నారు.
కాగా... సుమారు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణ విషయంలో చైనాతో టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల మాట్లాడుతూ.. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని పేర్కొంటూ.. అది భారత్ లో కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... తన వారసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు.
అనంతరం దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల దలైలామా పుట్టిన రోజు వేడుకలకు హాజరైన భారత కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టం చేశారు.
ఇలా దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేయడాన్ని.. ఆ వేడుకలకు భారతదేశ మంత్రులు, అధికారులు హాజరు కావడాన్ని చైనా నిరసించింది. మరోవైపు దలైలామా వారసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి వైఖరి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
