Begin typing your search above and press return to search.

2027 జనగణనలో ప్రత్యేకతలివే..

జనగణన అనేది దేశ ప్రజల సంఖ్య, వారి వయసు, లింగం, విద్యా స్థాయి, వృత్తి, మతం, భాష, నివాస స్థితి, కుటుంబ వివరాలు, కులాలు తదితర అంశాలను సేకరించే వ్యవస్థ.

By:  Tupaki Desk   |   12 Jun 2025 7:00 AM IST
2027 జనగణనలో ప్రత్యేకతలివే..
X

భారతదేశంలో 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనగణన ప్రారంభం కానుంది. 2027, మార్చి 1వ తేదీని ఈ జనగణనకు ప్రామాణిక తేది (Reference Date)గా తీసుకుంటామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈసారి జనగణన చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు.

- జనగణన అంటే ఏమిటి?

జనగణన అనేది దేశ ప్రజల సంఖ్య, వారి వయసు, లింగం, విద్యా స్థాయి, వృత్తి, మతం, భాష, నివాస స్థితి, కుటుంబ వివరాలు, కులాలు తదితర అంశాలను సేకరించే వ్యవస్థ. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా తెలుసుకుని తదనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుంది.భారతదేశంలో తొలి జనగణన 1872లో ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తరువాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. 2011లో చివరి సారిగా జనగణన జరిగింది. అయితే 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

ఈసారి ప్రత్యేకతలు ఏమిటి?

ఈసారి జరగబోయే జనగణనలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. మొట్టమొదటిసారి జనగణన పూర్తి డిజిటల్ రూపంలో ఉంటుంది. డేటా సేకరణకు మొబైల్ యాప్‌లు, ట్యాబ్‌లు వాడుతారు. 1931 తర్వాత ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరి కుల వివరాలను అడుగుతున్నారు. ఇది దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థపై ప్రగాఢ ప్రభావం చూపనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో ప్రారంభం. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ గణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు చేస్తారు.

- జనగణన ఆలస్యానికి కారణం?

2021 జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే కొత్త తేదీలను ప్రకటించారు.

-దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల తగ్గిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బడ్జెట్ వ్యయాలు

2021-22 బడ్జెట్‌లో జనగణన కోసం రూ.3,768 కోట్లు కేటాయించగా, 2024-25 బడ్జెట్‌లో రూ.574.80 కోట్లు కేటాయించారు. జనగణనకు నిధుల కొరత ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈసారి జరగబోయే 2027 జనగణన భారత దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో ఎన్నో కీలక మార్పులకు దారితీయనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, కుల గణన వల్ల కొత్త దిశలో దేశ పరిపాలన సాగనుంది. ఈ గణన ఫలితాల ప్రభావం 2029 ఎన్నికల వరకు కనిపించకపోయినా, ఆ తర్వాతి రాజకీయ చరిత్రను మలుపుతిప్పే అవకాశముంది.