పాకిస్తాన్‌కు షాక్ ఇవ్వడానికి భారత్ రెడీ.. 'ఇగ్లా' క్షిపణులు సిద్ధం!
భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టడానికి ఇండియా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 5 May 2025 3:00 AM ISTభారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టడానికి ఇండియా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేందుకు మన సైన్యం అత్యాధునిక ఆయుధాలను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగానే తక్కువ దూరంలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను నేలకూల్చే స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ సిద్ధం చేస్తోంది.
కొద్ది రోజుల క్రితమే రష్యా నుంచి లేటెస్ట్ ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను దిగుమతి చేసుకుంది. ఇవి చాలా తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వీటిని కొనుగోలు చేశారు. వాస్తవానికి కొన్ని వారాల క్రితమే ఈ క్షిపణులు భారత్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మరిపోవడంలో శత్రువులకు దీటైన సమాధానం ఇచ్చేందుకు వీటిని రెడీ చేస్తున్నారు. ఈ స్వల్ప శ్రేణి క్షిపణులతో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఈజీగా పేల్చివేయవచ్చు.
దాదాపు రూ.260 కోట్ల ఖర్చుతో ఈ ఇగ్లా-ఎస్ క్షిపణులను కొనుగోలు చేశారు. ముఖ్యంగా పశ్చిమ సరిహద్దుల్లో వీటిని ఉపయోగించడం చాలా అనుకూలంగా ఉంటుంది. భారత వాయుసేన ఆయుధాగారంలో కూడా ఈ క్షిపణులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆయుధాల విడిభాగాలను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. సైనిక దళాలను ఎల్లప్పుడూ యుద్ధానికి రెడీగా ఉంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా కూడా 48 లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ క్షిపణుల కోసం సైన్యం టెండర్ రిలీజ్ చేసింది. వీటిని కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలోనే కొనుగోలు చేయనున్నారు. వీటితోపాటు కొత్త తరం ఇగ్లా క్షిపణులపై కూడా దృష్టి పెట్టారు. వాటికి లేజర్ బీమ్ రైడింగ్ కెపాసిటీ కూడా ఉంది.
భారత సైన్యం 1990 నుంచి ఇగ్లా క్షిపణులను ఉపయోగిస్తోంది. దేశీయ సంస్థలు వీటిలో మార్పులు చేసి ఇగ్లా-ఎస్ వెర్షన్‌ను సిద్ధం చేశాయి. పాకిస్తాన్ సైన్యం అనేక రకాల డ్రోన్లు, యూఏవీలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇగ్లా-ఎస్ క్షిపణుల అవసరం భారత్‌కు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితోపాటు మన దళాలు స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్‌ను కూడా మోహరించనుంది.
