పాక్ కు అప్పు కూడా పుట్టనివ్వకుండా.. భారత్ మరో కీలక నిర్ణయం!
పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ ను భారత్ అష్టదిగ్భందనం చేస్తుంది.
By: Tupaki Desk | 30 April 2025 12:44 PM ISTపహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పాక్ కు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది భారత్. ఇందులో భాగంగా.. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు రూపంలో భారీ షాకిచ్చింది. మరోపక్క పాకిస్థాన్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేసింది.
ఇదే సమయంలో... పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేయాలని.. ఆ దేశ నౌకలు భారత్ పోర్టుల్లోకి వచ్చేందుకు నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పాక్ ను దౌపాక్షికంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న భారత్... ఆ దేశానికి వచ్చే అప్పులు కూడా రానివ్వకుండా చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.
అవును... పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ ను భారత్ అష్టదిగ్భందనం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని.. ఆ దేశానికి నిధులు ఇస్తే వాటిని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.)కు భారత్ సూచించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి పాకిస్థాన్ కు ఇప్పటికే 1.3 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణాన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై ఐ.ఎం.ఎఫ్. బోర్డు మే 9న చర్చించనుంది. మరోపక్క గతేడాదిలో ప్రకటించిన పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయాన్ని సమీక్షించాలని భారత్ కోరింది.
ఇదే సమయంలో.. ఈ విషయాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్ తో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణాన్ని ఇవ్వొద్దని.. ఇప్పటికే ప్రకటించిన 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారు.
ఈ విధంగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్... పాక్ ను ఆర్థికంగా మరింత ఇబ్బందిపెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్ కు ఐ.ఎం.ఎఫ్. నుంచి అప్పు పుట్టకుండా ప్రయత్నిస్తుంది.
