Begin typing your search above and press return to search.

చైనాకు తొలి షాక్ ఇచ్చిన భారత్

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్‌కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   14 May 2025 3:47 PM IST
చైనాకు తొలి షాక్ ఇచ్చిన భారత్
X

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్‌కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేసింది. 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తోందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది.

గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వారికి 'అకౌంట్ విత్‌హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ రెస్పాన్స్ టు ఎ లీగల్ డిమాండ్' భారత్‌లో చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఖాతా నిలిపివేయబడింది అని కనిపిస్తోంది. కేవలం గ్లోబల్ టైమ్స్ మాత్రమే కాకుండా, మరో చైనా మీడియా సంస్థ షిన్హువా, తుర్కియేకు చెందిన టీఆర్‌టీ వరల్డ్‌ల సామాజిక మాధ్యమ ఖాతాలపైనా భారత్ వేటు వేసింది.

ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ధీటైన బదులు ఇచ్చాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసి, వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే, ఈ మిలిటరీ ఆపరేషన్‌పై గ్లోబల్ టైమ్స్ తన ఖాతా ద్వారా నిరాధారమైన తప్పుడు కథనాలను ప్రచారం చేయడం ప్రారంభించింది.

- భారత దౌత్య కార్యాలయం స్పందన

గ్లోబల్ టైమ్స్ చేపట్టిన ఈ కవరేజ్‌పై చైనాలోని భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా స్పందించింది. నేరుగా గ్లోబల్ టైమ్స్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. "డియర్ గ్లోబల్ టైమ్స్" అంటూ సంబోధిస్తూ, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని గట్టిగా సిఫారసు చేసింది. ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే కొన్ని ఖాతాలు నిరాధార కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని, వాటిని ధ్రువీకరణ లేకుండా షేర్ చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని దౌత్య కార్యాలయం పేర్కొంది.

- పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌

'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో నెట్టింట్లో విస్తృతంగా చక్కర్లు కొట్టిన అసత్య ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఎప్పటికప్పుడు అడ్డుకుంది. ఫ్యాక్ట్‌చెక్‌ల ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది.

విదేశీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు భారతదేశ అంతర్గత వ్యవహారాలు.. భద్రతా కార్యకలాపాలపై దుష్ప్రచారం చేయడాన్ని భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో గ్లోబల్ టైమ్స్, షిన్హువా, టీఆర్‌టీ వరల్డ్ ఖాతాలపై తీసుకున్న ఈ చర్య స్పష్టం చేస్తుంది. తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ప్రదర్శించింది.