అదను చూసి బంగ్లా తోక కత్తిరించిన మోడీ !
రెచ్చిపోతే చచ్చిపోతారు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. బంగ్లాదేశ్ తీరు అలాగే ఉంది మరి.
By: Tupaki Desk | 11 April 2025 2:00 AM ISTరెచ్చిపోతే చచ్చిపోతారు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. బంగ్లాదేశ్ తీరు అలాగే ఉంది మరి. భారత్ పూనుకోకపోతే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఏర్పాటు అయ్యేది కాదు. గత యాభై ఏళ్ళుగా ఆర్ధికంగా ఇతరత్రా అన్ని విధాలుగా భారతదేశం అండగా నిలుస్తూ వచ్చింది. లేకపోతే పాకిస్తాన్ మాదిరిగా బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సమస్యలతో ఇక్కట్లు పడేది.
అయితే చేసిన మేలు మరచి బంగ్లాదేశ్ ఇపుడు భారత్ వ్యతిరేక కూటమిలో చేరుతోంది. ఇటీవల చైనా వెళ్ళి భారత్ మీద బంగ్లా తాత్కాలిక పాలకుడు యూసన్ నోరు పారేసుకున్నారు. దాని ఫలితం ఏంటో ఆయనకు తొందరలోనే భారత్ చూపించింది 2020లో భారత్ బంగ్లాదేశ్ కి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది
అదేంటి అంటే భారత్ భూభాగం నుంచి నేపాల్ భూటాను మయన్మార్ దేశాలకు బంగ్లాదేశ్ తన ఎగుమతులను చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ట్రాన్స్ షిప్ మెంట్ అని దీనిని అంటారు. దీని వల్ల ఆర్థికంగా బంగ్లాదేశ్ ఎంతో లాభపడుతూ వచ్చింది. ఇపుడు అదను చూసుకుని మరీ మోడీ ప్రభుత్వం ఈ వెసులుబాటుని బంగ్లాదేశ్ కి రద్దు చేసింది. దాంతో ఇక మీదట భారత్ గుండా బంగ్లా ఎగుమతులు చేసుకునే వీలు ఉండదన్న మాట.
చైనా పర్యటనలో యూనన్ నోటి దురుసే ఈ పరిస్థితికి కారణం అని చెప్పాలి. ఆయన భారత్ ఈశాన్య రాష్ట్రాలకు సముద్రయానం లేదని, అవి భూపరివేష్టిత రాష్ట్రాలుగా పేర్కొన్నారు. వాటికి తామే రక్షకులమని కూడా పెద్ద మాట వాడారు. అలా ఈశాన్య రాష్ట్రాల చుట్టూ మొత్తం బంగ్లాదేశ్ ఉందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
మరో అడుగు ముందుకేసి ఈశాన్య రాష్ట్రాలలో వాణిజ్యం పరంగా తన పట్టుని పెంచుకోవడానికి చైనాకు మంచి అవకాశం ఉందని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా హద్దులు సరిహద్దులు భూభాగాలూ మరచి యూనన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఫలితం ఏమిటి అన్నది చాలా తొందరగానే భారత్ రుచి చూపించింది అని అంటున్నారు.
ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం నిర్వాకం వల్ల బంగ్లాదేశ్ ఇబ్బందులో ఉంది షేక్ హసీనా భారత్ తో చెలిమి చేస్తూ పొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటూ తమ దేశాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్న క్రమంలో గత ఏడాది ఆగస్టులో ఆమెను కూలదోసి వచ్చిన యూనన్ తాత్కాలిక ప్రభుత్వం వల్ల ఏమీ ఒరిగింది లేదని ఆ దేశ ప్రజలు అంటున్నారు. ఇక యువత విద్యార్ధులను ముందు పెట్టి వారిని ఎగదోసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించేసిన తరువాత ఏమీ మారలేదని తెలుసుకున్న యువత కూడా యూనన్ ప్రభుత్వం మీద రగిలిపోతోంది.
ఒక విధంగా బంగ్లాలో సాధారణ పరిస్థితులు లేవు. ఇక భారత్ తో వైరం పెట్టుకుని చైనాతో కొత్త చెలిమికి చేస్తూ గత ఎనభై ఏళ్ళుగా తమను ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్ తో మంచిగా ఉంటూ వారిని తమ దేశానికి ఆహ్వానిస్తూ బంగ్లా పాలకులు చేస్తున్న ఈ ఎత్తులు జిత్తులు అన్నవి చివరికి ఎటు తిరిగి ఏమి చేస్తాయో అన్న భయం అయితే జనాలలో ఉంది.
