Begin typing your search above and press return to search.

ఇండీ కూట‌మి 6 గంట‌ల భేటీ.. గ‌తాన్ని త‌ల‌చి.. భ‌విష్య‌త్తుపై ఆశ‌ల‌తో.. !!

ప్ర‌ధానంగా ఇండియా కూట‌మి స‌మావేశం ఏం చ‌ర్చించింద‌నే విష‌యానికి ప్రాతిప‌దిక లేకుండాపోయింది. ఎందుకంటే.. అస‌లు ఎలాంటి అజెండానే లేకుండా ఈ స‌మావేశం జ‌రిగింది.

By:  Garuda Media   |   9 Jun 2026 10:11 AM IST
ఇండీ కూట‌మి 6 గంట‌ల భేటీ.. గ‌తాన్ని త‌ల‌చి.. భ‌విష్య‌త్తుపై ఆశ‌ల‌తో.. !!
X

సుదీర్ఘ విరామం.. ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనిఇండియా కూట‌మి సోమ‌వారం సుదీర్ఘ భేటీ నిర్వ‌హించింది. `ఇండియా జ‌న్‌బంధ‌న్‌` పేరుతో నిర్వ‌హించిన ఈ స‌మావేశం.. ఢిల్లీ వేదిక‌గా కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో జ‌రిగింది. మ‌ధ్యా హ్నం 2.30 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా ఆరు గంట‌ల‌కు పైగానే.. ఈ స‌మావేశం సాగింది. వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నమే.. ఈ స‌మావేశం జ‌రగాల్సి ఉంది. అయితే.. ప‌లు పార్టీల నాయ‌కులు ఈ స‌మావేశానికి వ‌చ్చేందుకు విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో వారిని బ్ర‌తిమలాడాల్సి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో షెడ్యూల్‌ను మ‌ధ్యాహ్నానికి మార్చారు.

బ‌లం-బ‌ల‌హీన‌త‌..

ఇండియా కూట‌మి పార్టీలు చేతులు క‌లిపినంత తేలిక‌గా.. చెలిమిని కొన‌సాగించ‌లేక పోతుండ‌డం తెలిసిందే. ప్ర‌ధాని మోడీని గ‌ద్దె దింప‌డమే ల‌క్ష్యంగా ఏర్ప‌డినా.. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌స్తున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కార‌ణంగా.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భావం చూపించేందుకు.. ఇండియా కూట‌మి పార్టీలు విడివిడిగా ప్ర‌య‌త్నించాయి.ఢిల్లీ నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల వ‌ర‌కు ఎవ‌రికి వారు బ‌ల ప్ర‌ద‌ర్శ‌నలు చేసుకున్నారు. అంతేకాదు.. టికెట్ల కేటాయింపులో కూడా జ‌ట్టు జ‌ట్టుప‌ట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ కూట‌మి క‌లివిడి.. నేతీబీర‌లో నెయ్యినే త‌ల‌పించింది. ఇక‌, ఇప్పుడు కేంద్రం నుంచి పెరుగుతున్న సెగ‌, మ‌రోవైపు.. ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీఘోర ప‌రాజ‌యం వంటివి కూట‌మిని మ‌రోసారిక‌లివిడి దిశ‌గా అడుగులు వేసేలా చేశాయి.

గ‌తాన్ని గుర్తు చేసుకుని..

ప్ర‌ధానంగా ఇండియా కూట‌మి స‌మావేశం ఏం చ‌ర్చించింద‌నే విష‌యానికి ప్రాతిప‌దిక లేకుండాపోయింది. ఎందుకంటే.. అస‌లు ఎలాంటి అజెండానే లేకుండా ఈ స‌మావేశం జ‌రిగింది. తొలుత దేశ ప్ర‌జ‌ల కోసం చ‌ర్చించేందుకేన‌ని ప్ర‌క‌టించారు. త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీని గ‌ద్దె దింపేందుకేన‌ని చెప్పారు. కానీ.. చివ‌ర‌కు స‌మావేశంలో తొలి మూడు గంట‌లు.. గ‌తాన్నిగుర్తు చేసుకుని వ‌గ‌చారు. ఇక‌పై ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌ద్ద‌ని.. జ‌ట్టు జుట్టు ప‌ట్టుకోవ‌ద్ద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. రేపు ఒక‌వేళ‌.. అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చినా(వ‌చ్చే ఏడాది చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి) స‌ర్దుబాటు ధోర‌ణిని పాటించాల‌ని తీర్మానానికి వ‌చ్చారు. ఈ చ‌ర్చ‌లు ముగిసిన త‌ర్వాత‌.. దేశం గురించి చ‌ర్చించారు.

దేశం కోసం..

ఇండియా కూట‌మి స‌మావేశంలో దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. ప్ర‌జ‌ల‌పై మోడీ భారాలు మోపార‌ని.. వాటి పై పోరాటం చేయాల‌నిరాహుల్ గాంధీ నిర్ణ‌యించారు. దీనికి మ‌మ‌తా బెన‌ర్జీస‌హా యూపీ విప‌క్ష నాయ‌కుడు అఖిలేష్ యాద‌వ్ ఓకే చెప్పారు.అలానే.. కేంద్రంపై పోరాడే విష‌యంలో స‌మ‌ష్టి కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని నాయ‌కులు తీర్మానించారు. అదేవిధంగా ఇండియా కూట‌మి స‌మావేశా నికి రాని పార్టీల‌ను బుజ్జ‌గించాల‌ని నిర్ణ‌యించారు. వ‌చ్చే ఆగ‌స్టులో మ‌రోసారి స‌మావేశం కావాల‌ని నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ ద‌ఫా స‌మావేశాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించాల‌ని తీర్మానించారు. ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి భేటీ కావాల‌న్న రాహుల్ సూచ‌న‌ల‌కు సూత్ర ప్రాయ ఆమోదం ల‌భించింది.