Begin typing your search above and press return to search.

జనవరి 29 - జూన్ 12... భారత్ రక్తసిక్తం వెనుక ఎవరు కారకులు?

ఈ ఏడాది ప్రారంభం నుంచి భారతదేశం రక్తసిక్తమైపోతోంది! ఎటు చూసినా భారీ ప్రమాదాలు.. రక్తంతో తడిచిన నేలలు.. కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా గుట్టలుగా మృతదేహాలు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 11:44 AM IST
జనవరి 29 - జూన్ 12... భారత్  రక్తసిక్తం వెనుక ఎవరు కారకులు?
X

ఈ ఏడాది ప్రారంభం నుంచి భారతదేశం రక్తసిక్తమైపోతోంది! ఎటు చూసినా భారీ ప్రమాదాలు.. రక్తంతో తడిచిన నేలలు.. కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా గుట్టలుగా మృతదేహాలు. సరాసరిన దాదాపు ప్రతీ నెలా ఏదో ఒక విషాదం జరుగుతుంది. ఒకదానిని మించి మరొకటి జరుగుతుంది. అయినా నాయకులు, అధికారులు, ప్రజలు ఏమి నేర్చుకుంటున్నారనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది.

అవును... ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశం, అమాయక ప్రజల రక్తంతో తడుస్తూనే ఉంది. అయినప్పటికీ అందుకు అటు నేతలు కానీ, ఇటు అధికారులు కానీ బాధ్యత తీసుకున్నట్లు కనిపించరు! ప్రశ్నించే ప్రజానికమూ కనుమరుగైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అల వచ్చినప్పుడు తల వంచుకుంటే సరిపోతుంది అన్నట్లుగా సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతులు కనుమరుగవుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 29 బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 40 మంది వరకూ మరణించగా.. 60 మందికిపైనే గాయపడినట్లు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ లెక్కలపైనా పలువురు సందేహాలు వ్యక్తపరిచిన పరిస్థితి. దీనికి అరకొర ఏర్పాట్లే కారణం అని విపక్షాలు మండిపడ్డాయి.

ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది కానీ.. ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎంత వరకూ తీసుకున్నారు? కాల గడిచింది, క్యాలెండర్ లో నెల మారింది.. మనిషి జ్ఞాపకాల్లోంచి ఆ విషయం దూరమైంది! అలా అని కుంభమేళాలో తొక్కిసలాట జరగడం, భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అదే తొలిసారి కాదు! 1954 నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. నాయకులు మాటలు చెబుతూనే ఉన్నారు!

ఆ తర్వాత జరిగిన చిన్న చిన్నవిగా అని చెప్పుకునే ఘటనల అనంతరం ఏప్రిల్ 22న అందమైన ప్రకృతిని కలిగిన, ప్రశంతమైన వాతావారణం కలిగిన జమ్మూకశ్మీర్ లోని పహల్గాం లోగల బైసరన్ లోయలో ఉగ్రమూకలు దాడి జరిపాయి. ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరుదామని వచ్చినవారిపై తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో బైసరన్ లోయ తడిచింది.

ఆ తర్వాత జరిపిన ప్రతీకార దాడుల సంగతి కాసేపు పక్కనపెడితే... అది సరిహద్దు ప్రాంతమని తెలుసు, సమస్యాత్మక ప్రాంతమనీ తెలుసు.. అక్కడ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తారని తెలుసు.. అయినప్పటికీ భద్రత లేదు.. అనే విమర్శలు వినిపించాయి. అయితే.. దీనికి ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎక్స్ గ్రేషియోలు ప్రకటించడమే ప్రతీ సమస్యకూ పరిష్కారమా?

అనంతరం... జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ ఐపీఎల్ జట్టు) తమ విజయోత్సవ యాత్రను నిర్వహించాయి! ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. నేర ఎవరిది? ముందు చూపులేని నాయకులదా? అధికారులదా? పోలీసులదా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

కట్ చేస్తే... అటు ఆర్సీబీ యాజమాన్యం, ఇటు కర్ణాటక ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించాయి. పలువురు పోలీసు అధికరులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం! అక్కడితో ఆ కథ ముగిసింది! తాజాగా జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 271 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. టాటా సంస్థ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. నేతలు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు!

ఇలా చెప్పుకుంటూ పోతే... ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి.. ఎంతోమంది అమాయకు ప్రజల రక్తంతో భారతమాత తడిచింది.. ఎందరో మృత్యువాత పడ్డారు.. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి ఏమీ ప్రకృతి విపత్తులు కాదు!!

కచ్చితంగా మనిషి నిర్లక్ష్యంతో కూడుకున్న ఘటనలే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అయినప్పటికీ దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రెస్ మీట్లు పెట్టి, ఆయా ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించే నాయకులా? గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులా? వారిని నిలదీయని పౌరులా?

ఎంత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినా.. ఎన్ని ప్రగాఢ సానుభూతులు తెలిపిన.. ఎంత తీవ్రంగా దాడులను ఘండించినా.. దీనికి కారణమైనవారు ఎంతటివారైనా వదిలిపెట్టమనే డైలాగులు పేల్చినా.. ఎన్ని లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియోలు ప్రకటించినా... అవి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవన్న విషయం నేతలు, అధికారులు, ప్రజలు గ్రహించాలి! ఈ లోకంలో విలువ కట్టలేనిది ఏమైనా ఉంటే అది ప్రాణం మాత్రమే!!