Begin typing your search above and press return to search.

ఒకే రోజులో పాక్ కు రెండు షాకులు

సింధు జలాల్ని నిలిపి వేయటం మొదలుకొని పలు ఆంక్షల్ని విధించిన భారత్.. ఈ రోజు (శనివారం) రెండు భారీ షాకుల్ని పాకిస్తాన్ కు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   3 May 2025 9:36 PM IST
ఒకే రోజులో పాక్ కు రెండు షాకులు
X

కండ బలం ఉన్నోడి బుద్ధిబలం తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తుంది. అలాంటి భావనకు చెక్ పెడుతూ.. కండ బలం.. బుద్ధిబలం రెండూ సమపాళ్లతో ఉంటే సీన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని భారత్ తన వరుస నిర్ణయాలతో ప్రపంచానికి చాటి చెబుతోంది. తమపై జరిగిన ఉగ్రదాడి తమనెంతలా రగిలిస్తుందన్న విషయాన్ని ప్రపంచానికి చెబుతూనే.. పాక్ ను అష్టదిగ్బంధనం చేసేలా పావులు కదుపుతోంది. సింధు జలాల్ని నిలిపి వేయటం మొదలుకొని పలు ఆంక్షల్ని విధించిన భారత్.. ఈ రోజు (శనివారం) రెండు భారీ షాకుల్ని పాకిస్తాన్ కు ఇచ్చింది.

ఈ రోజు పాక్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ షాక్ నుంచి పాక్ కోలుకోకముందే.. మరో భారీ షాక్ ను ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి వాయు.. ఉపరితల మార్గాల ద్వారా భారత్ కు వచ్చే అన్ని రకాల మొయిల్స్.. పార్సిళ్ల ఎక్స్ఝైంజీలను నిలిపి వేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి భారత్ కు వచ్చే అన్ని ప్రత్యక్ష.. పరోక్ష దిగుమతులపై నిషేధాన్ని విధించిన విషయాన్ని తాజాగా ప్రకటించింది.

ఇప్పటికే పాక్ తో సముద్ర రవాణా మార్గాల్ని భారత్ మూసేసిన సంగతి తెలిసిందే. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం బ్యాన్ విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేసిన వైనం తెలిసిందే. వీటితో పాటు పాకిస్థాన్ కు భారత్ నుంచి వెళ్లే ఎలక్ట్రానిక్స్.. ఈకామర్స్ వస్తువుల ఎగుమతిని సైతం పరిమితం చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఆంక్షల నిర్ణయం త్వరలో వెలువడుతుందని చెబుతున్నారు. మొత్తంగా పాక్ ను యుద్ధానికి ముందే దాని స్థైర్యాన్ని దెబ్బ తీయటమే లక్ష్యంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి చెప్పాలి.