ఉద్రిక్తతల వేళ.. 'ఆపరేషన్ ఆక్రమణ్'తో భారత్ వాయుసేన సంచలనం
పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది.
By: Tupaki Desk | 25 April 2025 10:55 AM ISTభారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన తన సంసిద్ధతను ప్రదర్శిస్తూ భారీ స్థాయి వైమానిక విన్యాసాలు నిర్వహించింది. 'ఆపరేషన్ ఆక్రమణ్' పేరుతో సెంట్రల్ సెక్టార్ పరిధిలో ఈ విన్యాసాలు జరిగాయి. దేశీయ అగ్రశ్రేణి ఫైటర్ జెట్లతో పాటు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఈ కసరత్తులో పాల్గొన్నాయి.
పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది. ఈ తరుణంలో జరిగిన ఈ విన్యాసాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాయుసేన వర్గాల సమాచారం ప్రకారం, ఈ విన్యాసాలలో రఫేల్, సుఖోయ్-30 MKI వంటి ప్రధాన యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వివిధ ఎయిర్బేస్ల నుంచి యుద్ధ విమానాలను తరలించి, క్లిష్టమైన ఆపరేషనల్ లో వాటి సామర్థ్యాన్ని పరీక్షించారు.
ఈ డ్రిల్లో భూఉపరితల లక్ష్యాలను ఛేదించడం, ముఖ్యంగా కొండ , మైదాన ప్రాంతాలు వంటి విభిన్న భౌగోళిక పరిస్థితులలో దాడి చేసే నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు. దీర్ఘ , స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను సమర్థవంతంగా నిర్వీర్యం చేసేలా పైలట్లు తమ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డ్రిల్స్ కూడా ఈ కసరత్తులో భాగమని రక్షణ వర్గాలు తెలిపాయి.
సాధారణంగా నిర్వహించే శిక్షణా విన్యాసాలలో ఇది భాగమైనప్పటికీ, ప్రస్తుత సరిహద్దు పరిస్థితులు , ప్రాంతీయ భద్రతా సవాళ్ల నేపథ్యంలో 'ఆపరేషన్ ఆక్రమణ్'కు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. భారత వాయుసేన తన ఆధునిక ఆయుధ సంపత్తితో, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలతో ఏ విధమైన పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఈ విన్యాసాలు చాటిచెప్పాయి. ఈ కసరత్తులను వాయుసేన ప్రధాన కార్యాలయం నిశితంగా పర్యవేక్షించింది.
