రక్షణ రంగంలో భారత్ ‘టాప్ 5’.. 92.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానం.. సిప్రి నివేదికలో సంచలన నిజాలు..
చైనా-పాకిస్థాన్‌ల నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ తన రక్షణ వ్యయాన్ని పెంచడం చారిత్రక అవసరమనే చెప్పాలి.
By: Tupaki Political Desk | 28 April 2026 4:10 PM ISTచైనా-పాకిస్థాన్‌ల నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ తన రక్షణ వ్యయాన్ని పెంచడం చారిత్రక అవసరమనే చెప్పాలి. ‘సిప్రి’ నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద రక్షణ వ్యయకర్తగా నిలవడం మన దేశ రక్షణ పటిష్టతకు నిదర్శనం. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ నిలవడం గర్వకారణం.
స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం (SIPRI) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రపంచ దేశాల ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో తెలియలేజేస్తుంది. 2025లో భారత్ తన రక్షణ రంగానికి 92.1 బిలియన్ డాలర్లు (సుమారు ₹7.7 లక్షల కోట్లు) ఖర్చు చేస్తుంది. ఇది 2024తో పోలిస్తే 8.9 శాతం ఎక్కువ. అమెరికా (954 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉండగా.., చైనా, రష్యా, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచ వ్యాప్తంగా సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2,887 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భారత ఎందుకు పెంచుకోవాలి?
భారత్ తన రక్షణ బడ్జెట్‌ను పెంచడం వెనుక ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, అంతకంటే బలమైన కారణాలు ఉన్నాయి. ఇటు చైనాతో నెలకొన్న వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఉద్రిక్తతలు, అటు పాకిస్థాన్ తన రక్షణ వ్యయాన్ని 11 శాతం పెంచడం వంటి పరిణామాలు భారత్‌ను అప్రమత్తం చేశాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన, సైనిక మోహరింపునకు నిధులను పెంచాల్సి వచ్చింది. పాత తరం ఆయుధాల స్థానంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, జలాంతర్గాములను చేర్చుకోవడం కోసం భారత్ భారీగా ఖర్చు చేస్తోంది. దిగుమతులను తగ్గించి స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు రక్షణ బడ్జెట్‌లో ఎక్కువ భాగం దేశీయ పరిశ్రమలకు కేటాయిస్తుంది. ఇది దీర్ఘకాలంలో మనకు మేలు చేస్తుంది.
గ్లోబల్ ట్రెండ్స్.. ఐరోపా దూకుడు
సిప్రి నివేదిక ప్రకారం.., 2025లో సైనిక వ్యయం పెరగడంలో ఐరోపా దేశాల పాత్ర కీలకంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపా తన రక్షణ వ్యయాన్ని 14 శాతం పెంచింది. జర్మనీ తన వ్యయాన్ని 114 బిలియన్ డాలర్లకు పెంచి భారత్ కంటే పైస్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ రక్షణ విధానంలో వచ్చిన మార్పును సూచిస్తోంది. అణు శక్తి, టెక్నాలజీ రంగంలో రష్యా తన ఖర్చును 190 బిలియన్ డాలర్లకు పెంచడం తీవ్రతను చాటిచెబుతోంది.
ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రక్షణ రంగం పటిష్టంగా ఉండాలి. అయితే, రక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయడం వల్ల విద్య, ఆరోగ్య రంగాలకు నిధుల కొరత ఏర్పడకుండా చూడడం ప్రభుత్వాలకు ఒక సవాలు. భారత్ తన రక్షణ వ్యయంలో ఐదో స్థానంలో ఉండడం అనేది మన 'బలాన్ని' సూచిస్తున్నప్పటికీ, దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారినప్పుడే ఖర్చుకు నిజమైన విలువ దక్కుతుంది. ప్రపంచ శాంతిని కాపాడడంలో భారత్ తనవంతు పాత్ర పోషిస్తూనే, తన సరిహద్దులను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
