Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుంచి నిఘా... భారత్ 52 ఉపగ్రహాల ప్రయోగంపై కీలక అప్ డేట్!

అవును... అంతరిక్షంలో నిఘాను మరింత బలోపేతం చేసేందుకు భారత్ చర్యలు చేపట్టింది.

By:  Tupaki Desk   |   1 July 2025 1:00 AM IST
అంతరిక్షం నుంచి నిఘా... భారత్  52 ఉపగ్రహాల ప్రయోగంపై కీలక అప్  డేట్!
X

ఆపరేషన్ సిందూర్ అనంతరం భూభాగంపై లోతైన నిరంతర నిఘా అవసరం కావడంతో సాయుధ దళాల కోసం అంకితమైన 52 ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేయాలని భారతదేశం యోచిస్తోంది. ప్రధానంగా... పాకిస్థాన్, చైనాలతో పాటు హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది.

అవును... అంతరిక్షంలో నిఘాను మరింత బలోపేతం చేసేందుకు భారత్ చర్యలు చేపట్టింది. దీనికోసం 52 మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో... రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ తదితర అవసరాల కోసం రూ.26,968 కోట్లను వెచ్చించనుంది. ఈ క్రమంలో ఇస్రో ద్వారా 21 ఉపగ్రహాలు, 3 ప్రైవేట్ సంస్థల ద్వారా 31 ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగం జరుగుతుంది.

ఈ ఉపగ్రహాలలో మొదటిది వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రయోగించబడుతుందని.. 2029 చివరి నాటికి మొత్తం 52 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఐడీఎస్) కింద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (డీ.ఎస్.ఏ.) నాయకత్వం వహిస్తుంది.

వాస్తవానికి మే 7 నుండి 10 వరకు పాకిస్తాన్‌ తో యుద్ధం నేపథ్యంలో వారి సైనిక కదలికలను ట్రాక్ చేయడానికి భారతదేశం కార్టోసాట్ వంటి దేశీయ ఉపగ్రహాలతో పాటు విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను ఉపయోగించి చిత్రాలను సేకరించింది. వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్‌ చేసి.. పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను దెబ్బతీశాయి.

ఇదే సమయంలో... అమెరికాకు చెందిన మ్యాక్సర్‌, ఐరోపాకు చెందిన సెంటినెల్‌ సేవలు కూడా భారత్‌ వాడుకొంది. రోజుకు ఒకసారి అయినా వీటి నుంచి ఫోటోలను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్‌ డేటాను 14 రోజులకు ఒకసారి తీసుకొనే అవకాశం ఉండగా.. తాజాగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే యుద్ధరంగంలో రియల్‌ టైమ్‌ డేటా వేగంగా అందే అవకాశం ఉంది.