Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌లో ఒలింపిక్స్‌..మేటి క్రికెటర్‌ కుమారుడు-జర్నలిస్ట్‌ ఫిదా

ఒలింపిక్స్‌... 200 దేశాల ఆటగాళ్లు పాల్గొనే మహా క్రీడా సంగ్రామం.. క్రికెట్‌లోనో, ఫుట్‌బాల్‌లోనో ప్రపంచ కప్‌లు నిర్వహించవచ్చు.. కామన్వెల్త్‌ క్రీడలకో, ఆసియా గేమ్స్‌కో ఆతిథ్యం ఇవ్వొచ్చు

By:  Tupaki Desk   |   15 Jun 2025 9:46 AM IST
హైదరాబాద్‌లో ఒలింపిక్స్‌..మేటి క్రికెటర్‌ కుమారుడు-జర్నలిస్ట్‌ ఫిదా
X

ఒలింపిక్స్‌... 200 దేశాల ఆటగాళ్లు పాల్గొనే మహా క్రీడా సంగ్రామం.. క్రికెట్‌లోనో, ఫుట్‌బాల్‌లోనో ప్రపంచ కప్‌లు నిర్వహించవచ్చు.. కామన్వెల్త్‌ క్రీడలకో, ఆసియా గేమ్స్‌కో ఆతిథ్యం ఇవ్వొచ్చు. కానీ, ఒలింపిక్స్‌ను నిర్వహించడం అంటే చిన్న దేశాల బడ్జెట్‌ కూడా సరిపోదు. అందుకే ఈ గేమ్స్‌ ఏ దేశానికి పడితే ఆ దేశానికి ఇవ్వరు.. అంతెందుకు? ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనాకు 2008లో కాని ఒలింపిక్స్‌ భాగ్యం దక్కలేదు. ఇక మన దేశానికి అంటారా...? ఇప్పట్లో కష్టమే అనిచెప్పాలి.

కొన్నాళ్లుగా చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం ఒలింపిక్స్‌ నిర్వహణ అనే మాటను పదేపదే చెబుతోంది. దీనికోసం పోటీ పడుతూ బిడ్‌ వేయాలని కూడా నిర్ణయించింది. ఈ లెక్కనచూస్తే ఒలింపిక్స్‌ నిర్వహణ భాగ్యం దగ్గర్లోనే ఉందని అనిపిస్తోంది.కాగా, 2028 ఒలింపిక్స్‌కు అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులోనే టి20 క్రికెట్‌ను కూడా తిరిగి ప్రవేశపెడుతున్నారు. 2032 ఒలింపిక్స్‌ను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరం నిర్వహించనుంది. కనీసం 8 ఏళ్ల ముందే భవిష్యత్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ అనేది ఖరారు అవుతుంది.

2036 ఒలింపిక్స్‌ ఎక్కడ?

ఇక మిగిలింది.. 2036 ఒలింపిక్స్‌ ఎక్కడ అనే ప్రశ్న. దీనికోసం ఇప్పటికే ఇండియా (అహ్మదాబాద్‌), ఇండోనేసియా (నుసాంతరా), తుర్కియే (ఇస్తాంబుల్‌), చిలీ (శాంటియాగో) దేశాలు ఆతిథ్యానికి బిడ్‌లు సమర్పించాయి. ఒకవేళ మన బిడ్‌ నెగ్గితే అహ్మదాబాద్‌లో 2036 ఒలింపిక్స్‌ జరుగుతాయని భావించాలి. కానీ, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మాత్రం తన బెస్ట్‌ చాయిస్‌ హైదరాబాద్‌ అని అంటున్నారు. ఈ నగరానికి వచ్చిన ప్రతిసారీ భారత దేశపు ఫ్యూచర్‌ సిటీగా మారుతుందనే నమ్మకం కలుగుతోందని కొనియాడారు. క్రీడా మౌలిక సదుపాయాలు, కావాల్సినంత ల్యాండ్‌ బ్యాంక్‌, పవర్‌ఫుల్‌ సర్వీస్‌ సెక్టార్‌, మల్టీ కల్చర్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ను 2036 ఒలింపిక్స్‌కు తన ఫేవరెట్‌గా చెబుతున్నారు రాజ్‌దీప్‌. ఇప్పటికే దేశ బ్యాడ్మింటన్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఎదిగిందని.. మీరు కాదంటారా? అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా, రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఎవరో కాదు.. ప్రముఖ క్రికెటర్‌ దిలీప్‌ సర్దేశాయ్ కుమారుడు. భారత తొలితరం ఓపెనర్‌ అయిన దిలీప్‌ దేశానికి 30 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2001 పరుగులు చేశారు. 5 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు సాధించారు. 1961 నుంచి 1972 వరకు దేశానికి ఆడారు. అన్నిటికి మించి 1971లో వెస్టిండీస్‌ టూర్‌లో దిలీప్‌ అద్భుతంగా ఆడారు. అరివీర భయంకర వెస్టిండీస్‌ పేసర్లను ఎదుర్కొంటూ ఆ సిరీస్‌లో ఏకంగా 5 టెస్టుల్లో 642 పరుగులు చేశారు. వీటిలో ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు ఉండడం విశేషం. ఈ సిరీస్‌ను భారత్‌ నెగ్గి..విదేశాల్లో తొలి టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకుంది.

కొసమెరుపుః దిలీప్‌ 1971 వెస్టిండీస్‌ టూర్‌లో ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌లు.. అతడితో పాటు ఆడిన ఓ కుర్రాడికి చాలా గొప్ప గుండె ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత ఆ కుర్రాడు టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌ అయ్యాడు. అతడే భారత బ్యాటింగ్‌ గ్రేట్‌ సునీల్‌ గావస్కర్‌.