13 ఏళ్ల క్రితం లెక్కలు.. ఇప్పటికీ నో సీక్రెట్! 2011 కుల గణన వెనుక అసలు కథ!
కులగణన చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, 2025లో జరిగే జనాభా లెక్కల్లో కులగణన కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
By: Tupaki Desk | 2 May 2025 6:30 AMకులగణన చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, 2025లో జరిగే జనాభా లెక్కల్లో కులగణన కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కానీ, 2011లో కూడా కులగణన జరిగిందని, ఆ లెక్కలను మాత్రం ఇప్పటివరకు ప్రజలకు తెలియజేయలేదు. అసలు అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలంలో జనాభా లెక్కలు తీయడం మొదలైంది. 1872లో మొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తర్వాత 1931 వరకు ఆంగ్లేయులు జనాభా లెక్కల్లో కులాల వివరాలను కూడా నమోదు చేశారు. 2010లో పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం దీనికి అంగీకరించడంతో 2011లో కులగణన జరిగింది.
అయితే, ఆ సమయంలో సేకరించిన కులాల గణాంకాలను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ఆ సమయంలో కులాల లెక్కల్లో చాలా తప్పులు దొర్లాయని చెబుతారు. చాలా మంది ప్రజలు తమ కుల గుర్తింపును వేర్వేరుగా పేర్కొన్నారు. కొందరు ఉపకులాలను తెలియజేస్తే, మరికొందరు తమ సామాజిక వర్గాన్ని కులంగా గుర్తించారు. 2022లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో దీని గురించి మాట్లాడింది. 2011 కులగణన గణాంకాలను విడుదల చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా, 2021లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం 2011లో జరిగిన కులగణనలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొంది. 2011లో జరిగిన కులగణన గణాంకాల్లో చాలా తప్పులున్నాయని, అవి ఉపయోగకరంగా లేవని ప్రభుత్వం తెలిపింది.