Begin typing your search above and press return to search.

ఇది అరుదైన ఘటన.. భారత స్వాతంత్య్ర సంబరాల్లో పాక్‌!

భారతీయుల సంబరాలకు లండన్‌ లో ఉన్న పాకిస్తానీయులు కూడా జత చేరారు. వారు కూడా భారత స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   17 Aug 2023 6:49 AM GMT
ఇది అరుదైన ఘటన.. భారత స్వాతంత్య్ర సంబరాల్లో పాక్‌!
X

భారత్‌ – పాక్‌ దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఉప్పూనిప్పూలాంటి పరిస్థితే ఉంటుంది. చివరకు ఏదైనా క్రీడల్లోనూ ఇరు దేశాలు తలపడ్డప్పుడు హై ఓల్టేజీ ఉద్వేగాలు నెలకొంటాయి. ఇరు దేశాల నేతల మధ్య మాటల తూటాలకు అయితే కొదవే లేదు. అలాంటిది రెండు దేశాలు ఒకే చోట స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకున్నాయి. ఈ ఘటన పెద్ద విశేషంగా మారింది.

మనదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, పాకిస్థాన్‌ ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆగస్టు 15 జరిగిన 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు అంబరాన్ని అంటేలా నిర్వహించారు.

ఈ క్రమంలో బ్రిటన్‌ రాజధాని లండన్‌ లోనూ భారీ ఎత్తున ఉన్న భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని జైహింద్‌ నినాదాలతో హోరెత్తించారు. బాలీవుడ్‌ సినిమా పాటలు.. 'తేరీ మిట్టి', 'జై హో', 'మా తుజే సలామ్‌', 'సందేసే ఆతే హై' వంటి పాటలకు భారతీయులు ఆనందంతో నృత్యం చేశారు. అందరూ ముక్త కంఠంతో పాటలు పాడి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.

భారతీయుల సంబరాలకు లండన్‌ లో ఉన్న పాకిస్తానీయులు కూడా జత చేరారు. వారు కూడా భారత స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొన్నారు. శత్రు దేశాలకు చెందిన ప్రజలు ఒకే చోట చేరి వేడుకలు జరుపుకున్నారు. దేశభక్తి పాటలకు భారతీయులతో కలిసి పాకిస్తానీయులు కూడా కాలు కదిపారు. డ్యాన్స్‌ చేశారు. పాక్, భారత్‌ పౌరులందరూ తమ జాతీయ జెండాలు పట్టుకొని పాటలు పాడటం విశేషం. భారత్‌ కు చెందిన మ్యుజిషియన్, ఇనస్టాగ్రామ్‌ సెలబ్రిటీ అయిన విష్‌ నిర్వహించిన కార్యక్రమంలో భారతీయులతోపాటు పాకిస్తానీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. శత్రు దేశాలైన భారత్‌ – పాక్‌ ప్రజలు తమ మధ్య విభేదాలను వీడి ఇలా సంబరాలు జరుపుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇరు దేశాలకు చెందిన ప్రజలు కూడా ఈ వీడియోపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో పాకిస్థాన్‌ లో నిర్వహించిన సర్వేలోనూ ఎక్కువ శాతం మంది ప్రజలు తాము భారత్‌ ను శత్రు దేశంగా చూడటం లేదని పేర్కొనడం విశేషం. అలాగే తాము యుద్ధాన్ని కూడా కోరుకోవడం లేదని చెప్పారు. సోదర దేశంగానే తాము భారత్‌ ను చూస్తామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టే తాజాగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాకిస్తానీయులు పాలుపంచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.