పిల్లలను చెడగొడుతున్న అసభ్య యూట్యూబ్ కార్టూన్ వీడియోలు
ఇది యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల వైఫల్యం అని చెప్పాలి. పిల్లల కోసం కావాల్సిన సమంజసమైన కంటెంట్‌ను ఎంపిక చేయడంలో ఇవి విఫలమవుతున్నాయి.
By: Tupaki Desk | 5 July 2025 5:00 AM ISTఈరోజుల్లో పిల్లలు యూట్యూబ్‌లో ఏం చూస్తున్నారో చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలుగుతోంది. చాలా యానిమేటెడ్ వీడియోలు పిల్లలకు అనుకూలమని చెప్పుకుంటున్నప్పటికీ, అందులో చూపించే కంటెంట్ మాత్రం అసభ్యంగా, అసహ్యంగా ఉంటోంది. ఇటీవల వైరల్ అయిన ఒక 'బేశర్మా బహూకా గ్రహ ప్రవేశ్' అనే యానిమేటెడ్ వీడియో. ఇందులో కొత్తగా పెళ్లైన కోడలు పెళ్లి దుస్తులు వేసుకోకుండా బికినీలో వధువుగా వచ్చి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇది చిన్నారులకు అనుకూలమా? అయినా ఈ వీడియోకు 18 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇది మనం ఎంత తీవ్రంగా ఈ సమస్యను పట్టించుకోవాలో గుర్తుచేస్తోంది.
ఇంకొక ఛానెల్ 'కహానీ ఘర్ ఘర్ కి' కూడా ఇటువంటి అసభ్య యానిమేషన్ కథలను పోస్ట్ చేస్తోంది. వీటికి థంబ్‌నెయిల్స్, టైటిల్స్ చూసినప్పుడు ఆ కుటుంబం, పెళ్లిళ్లు వంటి విషయాల గురించి అనిపిస్తుంది. కానీ వీడియోలు చూస్తే అసలు విషయాలు బయటపడతాయి. వాస్తవానికి, పిల్లలకు అనర్థకరమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ తరహా వీడియోలు యూట్యూబ్ అల్గారిథం ద్వారా సులభంగా పిల్లల స్క్రీన్ వరకు చేరుతున్నాయి.
ఇది యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల వైఫల్యం అని చెప్పాలి. పిల్లల కోసం కావాల్సిన సమంజసమైన కంటెంట్‌ను ఎంపిక చేయడంలో ఇవి విఫలమవుతున్నాయి. అలాగని తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యతను టెక్ కంపెనీలపై వేయడం సరికాదు. పిల్లలు ఏం చూస్తున్నారు? ఎలాంటి వీడియోలపై ఎక్కువగా సమయం గడుపుతున్నారు? అనే విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
ఈ సమస్యను అరికట్టడానికి యూట్యూబ్, గూగుల్ వంటి కంపెనీలు కంటెంట్‌ను మరింత కఠినంగా పర్యవేక్షించాలి. పిల్లల కోసం ప్రత్యేకమైన ఫిల్టర్లను ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు డిజిటల్ అవగాహన పెంచుకోవాలి. పిల్లల డివైజ్‌లపై పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించాలి. పిల్లల మానసికాభివృద్ధిపై ప్రభావం చూపే ఈ అసభ్య వీడియోలు తక్షణమే తొలగించాలి.
పిల్లల అమాయకత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ. దీని కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.