Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ కు మరణశిక్ష? ఇంతకూ అంత పెద్ద కేసేంటి?

మూలాలన్నిభారత్ వే అయినప్పటికీ దేశంగా ఏర్పడిన తొలి రోజు నుంచే పాకిస్థాన్ తీరు భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:08 AM GMT
ఇమ్రాన్ కు మరణశిక్ష? ఇంతకూ అంత పెద్ద కేసేంటి?
X

మూలాలన్నిభారత్ వే అయినప్పటికీ దేశంగా ఏర్పడిన తొలి రోజు నుంచే పాకిస్థాన్ తీరు భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద నేత కానీ.. అధినేత కానీ.. ప్రజాదరణ ఎంత ఉన్నా వారందరి జీవితాల్లో పల్లకీలు మోయటం ఎలానో.. పక్కకు పెట్టి.. పాతాళానికి నెట్టేసి.. జీవితంలో వారెవరూ ఊహించని రీతిలో శిక్ష పడేలా చేయటంలో దాయాది దేశానికి ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికీ ఉండదనే చెప్పాలి. తాజాగా దేశ మాజీ ప్రధానమంత్రి.. పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్న కేసులు అక్షరాల 150.

అందులో అతి పెద్ద కేసేంటి? అది కానీ నిరూపితమైతే ఇమ్రాన్ కు పడే శిక్ష ఏంటి? అన్న ప్రశ్నకే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కారణం.. పాక్ ఆర్మీ చట్టం ప్రకారం ఆ నేరం కానీ నిరూపితమైతే పడేది మరణశిక్ష కావటమే దీనికి కారణం. ప్రస్తుతం వివిధ కేసులకు సంబంధించి ఆయనకు 34 ఏళ్ల జైలుశిక్ష విధించటం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు కీలకమైన ఎన్నికల వేళ పార్టీనేతలకు అందుబాటులో లేకపోవటం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.

ఇక.. ఇమ్రాన్ కు మరణశిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతున్న కేసు వివరాల్లోకి వెళితే.. ఈ కేసును ఆయనపౌ 2023 మేలోనమోదు చేశారు. ఇందులో దోషిగా తేలితే మాత్రం మరణశిక్ష ఖాయమంటున్నారు. ఆల్ ఖదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ ను అరెస్టు చేసినంతనే.. ఆయనకు మద్దతుగా నిలిచే వారు.. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేపట్టారు ఇదెంత పెద్ద ఎత్తున సాగిందంటూ పలు ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. పలు భవనాల్ని ధ్వంసం చేశారు.

చివరకు రావల్పిండిలోని ఆర్మీ బేస్ క్యాంప్ మీదా దాడి జరిగింది. ఈ సందర్భంగా సాయుధ బలగాల్ని మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ తో సహా మొత్తం వంద మంది మీద కేసులు నమోదు చేశారు.ఈ కేసుల్లో ఇమ్రాన్ దోషి అని తేలితే మరణశిక్ష ఖాయమంటున్నారు. ఎందుకంటే.. పాక్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం పాక్ ప్రజలు దేశం మీద కానీ ఆ దేశ ఆర్మీ మీద కానీ దాడులకుపాల్పడితే వారికి మరణశిక్ష ఉంటుంది. ప్రస్తుతంఆర్మీ కోర్టులో ఈ కేసు ఉంది. ఈ కేసుపై తీర్పు వెలువడకుండా పాక్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

పాక్ ఆర్మీ మాత్రం ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా చూస్తోంది. మరోవైపు ఇదే అంశంపై ఇమ్రాన్ స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థి నవాజ్ షరీఫ్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావటంకోసం తనపై తప్పుడు ఆరోపణల్ని చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కీలక ఎన్నికలకు ముందు ఇమ్రాన్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆయన పార్టీ గుర్తు అయిన క్రికెట్ బ్యాట్ గుర్తును తొలగించటంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిస్థితుల్లో ఇమ్రాన్ పార్టీకి ఓటమి ఖాయమంటున్నారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయటానికి వీల్లేకుండా బ్యాన్ విధించటంతో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ విజయం ఖాయమని.. ఆయన నాలుగోసారి పాక్ కు ప్రధాని కాబోతున్నట్లుగా వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ తన ఓటును తానే వేయటం లేదు. ఎందుకుంటే.. తనను తాను అనర్హుడిగా పేర్కొంటూ ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నారు.