Begin typing your search above and press return to search.

ఇంతకూ ఇమ్రాన్ ఖాన్ మరణించారా..? స్పష్టత లేదు...ఉద్రిక్తత తగ్గదు...

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారా? లేదా అన్న విషయం ఓ బ్రహ్మపదార్థంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   2 Dec 2025 12:01 PM IST
ఇంతకూ ఇమ్రాన్ ఖాన్ మరణించారా..? స్పష్టత లేదు...ఉద్రిక్తత తగ్గదు...
X

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారా? లేదా అన్న విషయం ఓ బ్రహ్మపదార్థంగా మారిపోయింది. ఈ మిస్టరీ అసలు వీడుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకం అవుతోంది. సరైన సమచారం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో రావల్పిండిలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తమకు సకాలంలో సమాచారం ఇవ్వటం లేదని ఇమ్రాన్ స్థాపించిన తెహ్రక్ ఎ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని ఇమ్రాన్ కు మద్దతుగా మంగళవారం భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా రావల్పిండీలో 144 సెక్షన్ విధించింది. అలాగే బుధవారం దాకా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలను నిషేధించింది.

మా నాన్నను ఒంటరిగా డెత్ సెల్ లో నిర్బంధించారని మా అనుమానాలు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఇమ్రాన్ కుమారులు ఖాసీం, సులేమాన్ అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం బైటికి పొక్కనీయడం లేదని, వారి ఆరోగ్యవిషయంగా తమకు అనుమానాలు కలుగుతున్నాయని కుమారులు ఆరోపిస్తున్నారు.తండ్రిని నిర్బంధించి నెలన్నర గడుస్తున్నా...వారి ఆచూకీ గురించి తెలపకపోవడం అమానవీయం అనీ, కనీసం తమనకు కలవనీకుండా అడ్డుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఒక్కటే మరణ వార్తల్ని ఖండించడం.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత రెండేళ్ళుగా జైలులో ఉంటున్నారు. 2023 ఆగస్టులో ప్రభుత్వం పలు ఆరోపణలపై అరెస్టు చేసింది. దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశారని, ప్రధానిగా లభించిన బహుమతుల్ని అమ్ముకున్నారని ఇలా దాదాపు వంద కేసులు ఇమ్రాన్ పై విధించారు. తొలుత అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్ కోర్టు దోషిగా తేల్చి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అప్పుడు లాహోర్ ఇమ్రాన్ నివాసంలో అతణ్ని అరెస్ట్ చేశారు. తదుపరి అయిదేళ్లపాటు ఏ పదవిలో ఉండకుండా నిషేధం విధించినట్లు తీర్పులో ఉంది.

పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ గా మంచి నేమ్ ఫేమ్ తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1996 తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పేరిట పార్టీ ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా పలు పోరాటాలు చేశారు. 2018లో పాక్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు 2022లో పార్లమెంటరీ విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఆ తర్వాత పలు అవినీతి, అధికార దుర్వినియోగ కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అరెస్టు అయ్యారు. అయితే నెలన్నర కాలంగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి ఏ సమాచారం లేకపోవడంతో అతని కుమారులతోపాటు పార్టీ కార్యకర్తలు విపరీతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను మరణించాడన్న వదంతలు వ్యాపించడంతో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తత దాల్చుతోంది. అయితే ప్రభుత్వం ఆందోళనల్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోందే కానీ ఇమ్రాన్ సమాచారాన్ని మాత్రం ఇవ్వడం లేదు.