Begin typing your search above and press return to search.

భారత్‌ – కెనడా ఉద్రిక్తతలు.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత?

పంజాబ్‌ విద్యార్థుల నుంచి కెనడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏటా రూ. 68,000 కోట్లు ఆర్జిస్తోందని ఖల్సా వోక్స్‌ తన నివేదికలో వెల్లడించింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 7:55 AM GMT
భారత్‌ – కెనడా ఉద్రిక్తతలు.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత?
X

ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన విమర్శలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా కెనడా తమ దేశంలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించగా.. భారత్‌ కూడా ఇందుకు దీటుగా బదులిచ్చింది. కెనడా సీనియర్‌ దౌత్యవేత్తను మన దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కెనడియన్లకు వీసాల జారీని నిలిపేసింది. అంతేకాకుండా కెనడాలో ఇప్పటికే ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని.. కాబట్టి తగు జాగ్త్రతలు తీసుకోవాలని కోరింది.

కాగా ప్రపంచంలో అమెరికా తర్వాత కెనడాలోనే భారత విద్యార్థులు ఎక్కువ మంది విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన విద్యార్థులే కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది అని చెబుతున్నారు. 2008 వరకు ప్రతి సంవత్సరం 38,000 మంది పంజాబీలు మాత్రమే కెనడా వీసా కోసం దరఖాస్తు చూసుకునేవారని, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇప్పుడు కెనడా – భారత్‌ ఉద్రిక్తతల ప్రభావం విద్యార్థులపైన కూడా పడుతోందని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల కెనడాలో చదువుతున్న తమ పిల్లల విద్యపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల చదువు కోసం ఖర్చు చేసిన డబ్బుపై తల్లిదండ్రులలో ఆందోళన మొదలైందని ‘ఖల్సా వోక్స్‌’ పేర్కొంది.

పంజాబ్‌ విద్యార్థుల నుంచి కెనడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏటా రూ. 68,000 కోట్లు ఆర్జిస్తోందని ఖల్సా వోక్స్‌ తన నివేదికలో వెల్లడించింది. ఖల్సా వోక్స్‌ నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొత్తం 2,26,450 వీసాలను కెనడా ఆమోదించింది. ఇందులో సుమారు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్‌ కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ విద్యార్థులు 2–3 ఏళ్ల పాటు కెనడాలో ఉండి వివిధ కోర్సులను చదువుతున్నారు. మొత్తం మీద కెనడాలోని పలు విద్యా సంస్థల్లో ప్రస్తుతం 3.4 లక్షల మంది పంజాబీ విద్యార్థులు ఉన్నారు.

కెనడాకు వెళ్తున్న భారతీయుల్లో దాదాపు 60 శాతం మంది పంజాబీలే ఉన్నారని అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టెంట్స్‌ ఫర్‌ ఓవర్సీస్‌ స్టడీస్‌ చైర్మన్‌ కమల్‌ భూమ్లా వెల్లడించారు. గత సంవత్సరం 1.36 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లారని తెలిపారు. వీరిలో ప్రతి విద్యార్థి సగటున 10,200 కెనడియన్‌ డాలర్లను గ్యారెంటీడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్టిఫికేట్‌ ఫండ్స్‌ గా డిపాజిట్‌ చేస్తున్నారని చెప్పారు. దీంతోపాటు వార్షిక రుసుముంగా 17,000 కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారని పేర్కొన్నారు.

కెనడాలో ఇప్పుడు తీవ్రంగా ఇళ్ల కొరత నెలకొందని తెలుస్తోంది. ఉద్యోగాలు లేకపోవడం, ద్రవ్యోల్బణం కూడా తోడు కావడంతో భారత విద్యార్థులు అక్కడ కష్టాలు పడుతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు అద్దె ఇళ్లు దొరక్క డోర్‌ టు డోర్‌ తిరుగుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉండే నగరాల్లో ఒకటైన ఒంటారియోలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉందని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. కెనడాలో 3,45,000 ఇళ్లకు కొరత ఉందని తెలుస్తోంది. దీంతో అక్కడ ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయని సమాచారం. దీంతో విద్యార్థులు ఉండటానికి అద్దె ఇల్లు దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు హిందూ విద్యార్థులు సిక్కులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండటానికి మొగ్గుచూపడం లేదని సమాచారం. హిందువులపై ఖలిస్తాన్‌ సానుభూతిపరులు దాడులకు పిలుపునివ్వడంతో జాగ్రత్తలరీత్యా హిందూ విద్యార్థులు తమ మకాంను సురక్షిత ప్రాంతాలకు మార్చుకోవడానికి మొగ్గుచూపుతున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అద్దె ఇళ్లు దొరకడం గగనంగా మారిందంటున్నారు. అద్దెలు భారీగా పెంచేయడంతో విద్యార్థులు భారీగానే ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.