అమెరికా సైన్స్ పతనమా? భారత్‌కు అవకాశమా?
ట్రంప్ ప్రభుత్వ విధానాలపై నాసా సహా అనేక ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా స్పందించారు.
By: Tupaki Desk | 10 July 2025 5:00 AM ISTఒకప్పుడు ప్రపంచ విజ్ఞాన రంగానికి కేంద్రంగా వెలుగొందిన అమెరికాలో ప్రస్తుతం ఓ చర్చ తీవ్రంగా నడుస్తోంది. "అమెరికా సైన్స్ పతనానికి చేరుకుందా?" శతాబ్దాలుగా అంతరిక్షం, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వైద్య పరిశోధనలు వంటి ఎన్నో రంగాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ ఇటీవల కాలంలో ట్రంప్ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అక్కడి శాస్త్రీయ సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. ఇది భారత్ లాంటి దేశాలకు ఓ సువర్ణావకాశంగా మారనుందా అనే కోణం నుంచి పరిశీలిద్దాం.
- ట్రంప్ పాలనలో శాస్త్రీయ రంగానికి షాక్
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా 2017-2021 మధ్య అమలు చేసిన కొన్ని విధానాలు అమెరికా సైంటిఫిక్ కమ్యూనిటీని తీవ్రంగా ప్రభావితం చేశాయి: సైన్స్ బడ్జెట్ కోతలు వల్ల ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH), నాసా వంటి కీలక పరిశోధనా సంస్థల బడ్జెట్లను భారీగా తగ్గించారు. ఇది అనేక ప్రాజెక్టుల పురోగతిని నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్‌ను 'అవాస్తవం' అన్న వాదనలతో పర్యావరణ మార్పులపై శాస్త్రీయ నివేదికలను ట్రంప్ బహిరంగంగా తిరస్కరించడం, గ్లోబల్ వార్మింగ్ ఒక బూటకమని వాదించడం పరిశోధకులను నిరాశపరిచింది. దీనివల్ల పర్యావరణ పరిశోధనలకు స్పష్టమైన మార్గనిర్దేశం లేకుండా పోయింది. సైంటిస్టుల వలసపై నిబంధనలు విధించి.. విదేశీ శాస్త్రవేత్తలు అమెరికాకు వచ్చి స్థిరపడటం కఠినతరం కావడంతో, ప్రపంచ స్థాయి మేధావులు అమెరికా వైపు చూడటం తగ్గింది. ఇది సైంటిఫిక్ ఇన్నోవేషన్‌లో కీలకమైన అంతర్జాతీయ సహకారాన్ని దెబ్బతీసింది.
- నాసా, అమెరికా సైంటిస్టుల ఆందోళన
ట్రంప్ ప్రభుత్వ విధానాలపై నాసా సహా అనేక ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా స్పందించారు. "మేము పరిశోధన కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది అమెరికా విజ్ఞాన రంగానికి హెచ్చరిక" అని నాసాకు చెందిన ఒక సీనియర్ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. బడ్జెట్ కోతలతో ఎన్నో ప్రాజెక్టులు వాయిదా పడటం లేదా రద్దు కావాల్సి రావడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ రంగంలో పనిచేసే పరిశోధకులు "సైన్స్‌ను రాజకీయంగా వాడుకోవద్దు" అంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు.
- భారత్‌కు ఇది అవకాశమేనా?
అమెరికాలో సైన్స్‌కి ఎదురవుతున్న ఈ సంక్షోభం భారత్‌కు ఓ బలమైన అవకాశాన్ని అందిస్తుంది. విదేశాల్లో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలు, ఇతర దేశాల మేధావులు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. "అక్కడ భద్రతా లేని రీసెర్చ్‌కి, ఇక్కడ నెమ్మదిగా ఎదుగుతున్న అవకాశాలే మేలు" అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసివస్తున్నాయి. ISRO, DRDO, CSIR వంటి ప్రభుత్వ సంస్థలు, కొత్తగా ఏర్పడుతున్న AI/క్వాంటం స్టార్టప్స్ పరిశోధనలకు అందిస్తున్న ప్రోత్సాహం గణనీయంగా పెరుగుతోంది. ఇది భారతదేశంలో బలమైన పరిశోధన వాతావరణాన్ని సృష్టిస్తోంది. అమెరికా బడ్జెట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నందున, కొన్ని రీసెర్చ్ పనులను ఇతర దేశాలకు ఔట్‌సోర్స్ చేసే అవకాశం ఉంది. ఇది భారతీయ సంస్థలకు, పరిశోధకులకు కలిసి వచ్చే అవకాశం.
- ట్రంప్ , హిట్లర్ పోలిక?
ఒక విచిత్రమైన పోలిక ఇప్పుడు శాస్త్రీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హిట్లర్ పాలనలో జర్మనీలో శాస్త్రవేత్తలపై తీవ్ర ఆంక్షలు విధించబడ్డాయి. దీనివల్ల ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తలు అమెరికాకు వలస వెళ్లారు. ఇప్పుడు అదే అమెరికాలో శాస్త్రవేత్తల వలసను ఆపే విధానాలు తీసుకోవడం, పరిశోధనలకు నిధులు తగ్గించడం చూస్తుంటే, "హిట్లర్ చేసిన తప్పును ట్రంప్ తిరిగి చేస్తున్నాడా?" అనే సందేహం కలుగుతోంది. చరిత్ర పునరావృత్తమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
అమెరికాలో శాస్త్రవేత్తల ఆందోళనలు, బడ్జెట్ కోతలు, పర్యావరణ నిబంధనలపై వ్యతిరేకత ఇవన్నీ కలిపి అమెరికా విజ్ఞాన రంగానికి ఒక హెచ్చరిక గంటలా మారాయి. అయితే ఇదే సమయంలో భారత్ వంటి దేశాలకు ప్రపంచ స్థాయిలో తమ సత్తాను నిరూపించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. విజ్ఞానం అనేది ఏ ఒక్క దేశానికో, రాజ్యాధికారానికో పరిమితం కాదు. ఎవరు అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తే వారిదే అవుతుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని భారత శాస్త్రవేత్తలు అందిపుచ్చుకుంటారా, లేదా అనేది వేచి చూడాలి.
