పాక్ కు బిగ్ ట్విస్ట్... కొత్త షరతులు విధించిన ఐఎంఎఫ్!
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లో భారత్ తో యుద్ధం మొదలైంది.
By: Tupaki Desk | 19 May 2025 7:00 AM ISTప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లో భారత్ తో యుద్ధం మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్).. పాక్ ను ఆదుకుందనే చెప్పాలి. ఇందులో భాగంగా... పాకిస్థాన్ కు 1 బిలియన్ డాలర్ల నిధులు (సుమారు రూ.8,500 కోట్లు) మంజూరు చేసింది. ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.
వాస్తవానికి ఎంఎంఎఫ్ ఇస్తున్న రుణం నిధులను పాకిస్థాన్ అభివృద్ధికి కాకుండా.. ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వినియోగిస్తోందని భారత్ ఇప్పటికే ఆరోపించింది. ఆ వాదనకు బలం చేకురుస్తూ... ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో ధ్వసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్మించడానికి ఆర్థిక సాయం చేసింది. ఇందులో భాగంగా.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు రూ.14 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో... పాకిస్థాన్ కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని మోడీ ప్రభుత్వం చేసిన వాదన, ఐఎంఎఫ్ కు చేసిన విజ్ఞప్తి నిజమైందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు తన బెయిలౌట్ ప్రోగ్రామ్ తదుపరి దశను విడుదల చేయడానికి ఐఎంఎఫ్ పలు షరతులను విధించింది. ఈ విషయం ఆసక్తిగా మారింది.
అవును... పాకిస్థాన్ కు 1 బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్).. తదుపరి దశను విడుదల చేయడానికి పలు షరతులను విధించింది. ఈ సందర్భంగా... భారత్ తో ఉద్రిక్తతలు ఇంకా పెంచుకోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని పాక్ కు చురకలు అంటించింది. ఈ ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.
ఇదే సమయంలో జూన్ 2025 చివరి నాటికి ప్రోగ్రామ్ లక్ష్యాలను చేరుకోవడానికి ఐఎంఎఫ్ సిబ్బంది ఒప్పందానికి అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు పార్లమెంటరీ ఆమోదం పొందాలనే కొత్త షరతును విధించింది. ఇదే సమయంలో 2028 నుంచి సంస్థాగత, నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తూ 2027 తర్వాత ప్రభుత్వ ఆర్థిక రంగ వ్యూహాన్ని వివరించే ప్రణాళికను సిద్ధం చేయాలి!
అదే విధంగా... ఇందన రంగంలోనూ ఐఎంఎఫ్ పలు కొత్త షరతులు పెట్టింది. ఇందులో భాగంగా... ఈ ఏడాది జూలై 1 నాటికి వార్షిక విద్యుత్ సుంకాల పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయాలి. ఇదే సమయంలో... ఫిబ్రవరి 2026 నాటికి ఇంధన సుంకాలను నిర్వహించడానికి సెమీ వార్షిక గ్యాస్ టారిఫ్ సర్ధుబాటు నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. ఈ విధంగా సుమారు 11 కొత్త షరతులను ఐఎంఎఫ్ విధించింది.
