Begin typing your search above and press return to search.

దారుణం... కల్తీ మద్యం సేవించి 21 మంది దుర్మరణం!

కల్తీ మద్యం పదుల సంఖ్యలోని కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాలను నింపింది.

By:  Tupaki Desk   |   23 March 2024 8:15 AM GMT
దారుణం... కల్తీ మద్యం సేవించి  21 మంది దుర్మరణం!
X

కల్తీ మద్యం పదుల సంఖ్యలోని కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాలను నింపింది. స్వల్ప ఆనందం కోసమో.. లేక, మత్తు కోసమో చేసిన పని ఊహించని దారుణమైన ఫలితాలను ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కల్తీ మద్యం సేవించడం వల్ల 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ వ్యవహారం ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోందని తెలుస్తుంది.

అవును... పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతిచెందారు. ఈ సమయంలో సంగ్రూర్ మెడికల్ ఆఫీసర్ చెప్పిన వివరాల ప్రకారం... ఇథనాల్ కలిగి ఉన్న కల్తీ మద్యం సేవించడం వల్ల సుమారు 40 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో నలుగురు మార్చి 20, బుధవారం మృతి చెందగా... మరుసటి రోజు పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.

ఈ క్రమంలో మార్చి 22 శుక్రవారం మరో ఎనిమిది మంది మరణించగా.. నేడు మరో ఐదుగురు మరణించారని తెలిపారు. దీంతో... కల్తీ మద్యం తాగి ఆసుపత్రులో చేరిన వారి మరణాల సంఖ్య 21కి చేరుకుంది. మిగిలినవారికి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా అప్పుడే చెప్పేలా లేదని వైద్యాధికారి వెల్లడించారు!

ఇక.. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు నిన్నటివరకూ నలుగురిని అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ కల్తీ మద్యం కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్న నేపథ్యంలో వారి ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందిందని.. ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్, ఒక రకమైన విష రసాయానాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా... ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని భావించిన పంజాబ్ ప్రభుత్వం.. అత్యున్నత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ వ్యవహారంలో పైకి కనిపిస్తున్న నిందితులే కాకుండా.. వెనక ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది!