Begin typing your search above and press return to search.

సినిమాల్లో మాదిరి ఛేజ్ చేసి మరీ కంటైనర్ పట్టుకున్న ఏపీ పోలీసులు

గతంలో గంజాయి అన్నంతనే ఎక్కడో ఒక చోట మాత్రమే దొరికేది. ఇప్పుడు సర్వం గంజాయి మయం అన్నట్లుగా మారింది

By:  Tupaki Desk   |   4 March 2024 6:20 AM GMT
సినిమాల్లో మాదిరి ఛేజ్ చేసి మరీ కంటైనర్ పట్టుకున్న ఏపీ పోలీసులు
X

గతంలో గంజాయి అన్నంతనే ఎక్కడో ఒక చోట మాత్రమే దొరికేది. ఇప్పుడు సర్వం గంజాయి మయం అన్నట్లుగా మారింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా నిత్యం పలు స్టేషన్లలో గంజాయి నిల్వల్ని పట్టుకోవటం.. పలు మార్గాల్లో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీకి చెందిన పోలీసులు ఒక కంటైనర్ ను పట్టుకునేందుకు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సినిమాటిక్ ఛేజింగ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ వ్యవహారంలోకి వెళితే.. మరీ ఇంతలానా? అనుకోకుండా ఉండలేం.

శ్రీకాకుళం టాస్కు ఫోర్సు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. అదెలానంటే.. చెన్నై నుంచి వచ్చిన ఒక కంటైనర్.. ఒడిశాలోని గారబంద ప్రాంతంలో గంజాయి లోడింగ్ చేసుకొని తిరిగి వెళుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులకు అందింది. వెంటనే సిబ్బంది అలెర్టు అయ్యారు.

అనుకున్నట్లే ఆదివారం వేకువ జామున తాము వెతుకుతున్న కంటైనర్ కళ్ల ముందుకు రాగానే దాన్ని నిలువరించారు. వాహనాన్ని తనిఖీ చేయాలని.. బండిని పక్కకు పెట్టాలని కోరారు. అయినప్పటికీ పట్టించుకోని లారీ డ్రైవర్ కంటైనర్ లారీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో.. ఈ తీరును గుర్తించని సిబ్బంది పక్కకు పడిపోయారు. దీంతో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కో సం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తప్పించుకుపోతున్న కంటైనర్ సమాచారాన్ని విశాఖజిల్లా పోలీసులకు అందజేశారు. దీంతో వారు బీమిలీ వద్ద కాపు కాశారు. అక్కడ కూడా కంటైనర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది.

దీంతో.. పోలీసులు కంటైనర్ ను పట్టుకునేందుకు ఛేజింగ్ మొదలు పెట్టారు. అయినప్పటికీ కంటైనర్ ఆగలేదు. ఛేజింగ్ మరీ తీవ్రం కావటంతో వాహనాన్ని వదిలేసిన డ్రైవర్.. క్లీనర్ పారిపోయారు. అనంతరం కంటైనర్ ను తనిఖీ చేయగా.. 386 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13 గోనె సంచుల్లో దీన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే.. ఈ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారు? దాని యజమాని ఎవరు? లాంటి వివరాల్ని సేకరిస్తున్నారు.