Begin typing your search above and press return to search.

అగ్ర రాజ్యంలోకి అక్రమ ప్రవేశం.. లక్షమందిదాక భారతీయుల అరెస్టు

యూసీబీపీ లెక్కలను చూస్తే.. 2019నాటికి ఇప్పటికి అమెరికాలోకి అక్రమంగా వెళ్లాలని ప్రయత్నించిన భారతీయుల సంఖ్య అమాంతం పెరిగింది

By:  Tupaki Desk   |   3 Nov 2023 3:30 PM GMT
అగ్ర రాజ్యంలోకి అక్రమ ప్రవేశం.. లక్షమందిదాక భారతీయుల అరెస్టు
X

డాలర్ల దేశం.. కలల రాజ్యం.. ఒక్కసారి ఏదోలా ప్రవేశిస్తే అక్కడే సెటిలైపోయి జీవితంలో పైకెదగొచ్చు.. వెనక్కుతిరిగి చూసుకోలేనంతటి స్థాయిలో ఆర్థికంగా స్థిరపడనూ వచ్చు. ఇదే ఉద్దేశంలో లక్షలాది మంది అమెరికా విమానం ఎక్కాలని భావిస్తుంటారు. కానీ, అందరికీ సాధ్యం కాదు కదా?. అమెరికాకు సుదూరంగా ఉన్నవారైతే ఏదో ఒక అవకాశం కింద ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇక మెక్సికో వంటి పొరుగు దేశాల ప్రజలైతే వీలు చూసుకుని సరిహద్దులు దాటేస్తుంటారు. అయితే, వారే కాదు.. మన భారతీయులు కూడా భారీ సంఖ్యలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు సాగిస్తారనే గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి.

ఐదు రెట్లు పెరిగిందట

అగ్రరాజ్యంలోని అక్రమంగా ప్రవేశించాలనుకున్న భారతీయుల సంఖ్య ఏడాది వ్యవధిలో ఐదు రెట్లు పెరిగిందట. ఇవేవో ఉజ్జాయింపు గణాంకాలు కావు. యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (UCBP) విడుదల చేసిన లెక్కలు. అందులోనూ గత ఏడాది కాలంలో ఇలాంటి వారిని 97 వేల మందిని అరెస్టు చేసినట్లు కూడా పేర్కొనడం గమనార్హం. ఈ సంఖ్యం క్రితం ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు అని కూడా వివరించింది. యూసీబీపీ.. అక్రమ వలసలకు సంబంధించిన సమాచారాన్ని ఏటా విడుదల చేస్తుంటుంది.

నాలుగేళ్ల కిందట 20 వేల లోపే..

యూసీబీపీ లెక్కలను చూస్తే.. 2019నాటికి ఇప్పటికి అమెరికాలోకి అక్రమంగా వెళ్లాలని ప్రయత్నించిన భారతీయుల సంఖ్య అమాంతం పెరిగింది. వీరి సంఖ్య 2019-20లో 19,883 మాత్రమే ఉండడం గమనార్హం. ఇక 2020-21లో 30,662కు పెరిగింది. 2021-22 మధ్య 63,927కు చేరింది. ఇక గత ఏడాది అక్టోబరు నుంచి అయితే పరాకాష్టనే. 2022 అక్టోబరు- మొన్నటి సెప్టెంబరు మధ్య 96,917 మంది భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని యూసీబీపీ వివరించింది.

ఆ రెండు దేశాల సరిహద్దుల నుంచే..

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు భారతీయులు ఎంచుకుంటున్న దేశాలు.. కెనడా, మెక్సికో. ఈ రెండింటికీ అమెరికాతో సుదీర్ఘ సరిహద్దు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇలా కెనడా సరిహద్దులో 30,010 మందిని, మెక్సికో సరిహద్దులో 41,770 మందిని పట్టుకున్నట్లు యూసీబీపీ వివరించింది. మైనర్లతో కలిసి వచ్చేవారు, కుటుంబంగా వచ్చేవారు, ఒంటరిగా వచ్చే పెద్దలు, ఒంటరిగా వచ్చే పిల్లలు అని వీరిని నాలుగు విభాగాలుగా విభజించినట్లు తెలిపింది. 2022-23లో అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 84 వేల మంది భారతీయుల్లో 730 మంది పిల్లలు ఒంటరిగా వెళ్లడం గమనార్హం. చిత్రమేమంటే.. వీరంతా ఫ్రాన్స్‌ నుంచి మెక్సికోకు చేరుకుని అద్దె బస్సుల ద్వారా అమెరికా సరిహద్దులకు చేరారు.

స్వదేశంలో రక్షణ లేదంట..?

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నవారు తమకు స్వదేశంలో రక్షణ లేదని చెబుతున్నారని సమాచారం. దీంతో చేసేదేం లేక... అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక ఏటా అమెరికాలోకి 20 లక్షల మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అగ్ర రాజ్యం వీసా విషయంలో కఠినంగా వ్యవహరించడం కూడా అక్రమ వలసలు పెరగడానికి కారణం అవుతోంది.