అమ్మతనం అంగడి సరుకు చేస్తున్నారా?
లక్ష్మి గతంలో ముంబైలో పిల్లల అమ్మకం, అక్రమ సరోగసీ కేసులో అరెస్టయి జైలు కెళ్లారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష కూడా అనుభవించారు.
By: Tupaki Desk | 16 Aug 2025 7:00 PM ISTసంతానం పొందాలనేది ప్రతీ దంపతుల కల.. తమ ఒడిలో పిల్లలను ఆడించాలని తహతహలాడుతుంటారు. మారుతున్న జీవిన శైలి.. ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్లు, వాతావరణ పరిస్థితులు, జన్యు లోపాలు, ఇతర అంశాల కారణంగా కొంత మంది దంపతులు సంతానానికి దూరమవుతున్నారు. అయితే ఈ సమస్య ఏటేటా పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగించే అంశమే. అయితే సంతానం పొందలేని దంపతులు దత్తత మార్గం కాకుండా ఇతర మార్గాల సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది విజయవంతమైన ప్రక్రియ అని అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఇటీవలి పరిణామాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. తమ అనుకున్న సంతానం పరాయి వాళ్లు అని తేలుతుండడం జీర్ణించుకోలేకపోతున్నారు.
సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన మరువకముందే మేడ్చల్ జిల్లాలో మరో అక్రమ సరోగసీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ సరోగసీ, అక్రమ అండాల వ్యాపారం చేస్తున్న ఏడుగురు మహిళలు, ఓ పురుషుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నిందితులు పేదింటి యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని సరోగసీ, అండాల దానం చేయడానికి ప్రలోభపెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. . వారికి కేవలం నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి, సరోగసీ ద్వారా పిల్లలు కనిపించుకునే తల్లిదండ్రుల నుంచి మాత్రం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి (45), ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి (23) కీలకంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు.
జైలు శిక్ష పడినా మారని తీరు..
లక్ష్మి గతంలో ముంబైలో పిల్లల అమ్మకం, అక్రమ సరోగసీ కేసులో అరెస్టయి జైలు కెళ్లారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోకుండా మళ్లీ అదే తరహ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత తన కుమారుడు, కూతురుతో కలిసి పాత పద్ధతిలోనే ఈ దందాను కొనసాగించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఏజెంట్ల ద్వారా వివరాలు..
సోదాల్లో లక్ష్మి ఇంటి నుంచి ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భాధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు పెద్దఎత్తున స్వాధీనం చేశారు. అదనంగా, పలు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించిన దంపతుల వివరాలను ఏజెంట్ల ద్వారా సేకరించిన ఆధారాలు కూడా లభించాయి.
ఆ వైద్యశాలలతో సంబంధాలు..
లక్ష్మి హెగ్డే హాస్పిటల్‌తో పాటు అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యశాలలతో ఉన్న అనుబంధాలపై లోతుగా విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
చీకటి కోణాలపై మరింత దర్యాపు..
ఇలాంటి అక్రమ సరోగసీ నెట్‌వర్క్‌లు పేద మహిళలను వలలో వేసుకుని తమ ప్రయోజనాల కోసం దోపిడీ చేస్తున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసు వెనుక మరెన్ని చీకటి కోణాలు ఉన్నాయో అనే అనే దానిపైనా దర్యాప్తు సాగుతోంది.
