తమ్ముళ్ల 'మట్టి రాజకీయం'.. బాబుకు బ్యాడ్!
దీంతో సీఎంవో వర్గాలు జోక్యం చేసుకుని మట్టి తరలింపు ప్రక్రియకు కొంతమేరకు బ్రేకులు వేశాయి.
By: Tupaki Desk | 3 May 2025 4:04 PMచంద్రబాబు చెబుతున్నా.. తమ్ముళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. మట్టి రాజకీయాలు జోరుగా సాగు తున్నాయి. ముఖ్యంగా ఓ మంత్రికి చెందిన నియోజకవర్గంలో నిరాఘాటంగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు.. తరలింపులు సర్కారుకు తలనొప్పిగా పరిణమించాయి. గత నెల ప్రారంభంలోనే ``సీఎం ఇంటి కోసం`` పేరుతో బహిరంగ బోర్డులు పెట్టి మరీ మట్టిని తరలించారు. దీనిపైపెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏకంగా మంత్రి పేరు కూడా బయటకు వచ్చింది.
దీంతో సీఎంవో వర్గాలు జోక్యం చేసుకుని మట్టి తరలింపు ప్రక్రియకు కొంతమేరకు బ్రేకులు వేశాయి. అయితే.. మళ్లీ గత నాలుగు రోజులుగా ఆగిరిపల్లి, సూరంపల్లి, ఈదర వంటి కీలక మారు మూల ప్రాంతాల్లో మట్టి కొండలు కబళించేస్తున్నారు. ఒకటి కారు రెండు కాదు..ఏకంగా పదుల సంఖ్యలో ట్రక్కులు మట్టిని తరలిస్తుండడంతోస్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీకి చెందిన ఓ నాయకుడు ఇలానే తరలించి.. చేతులు కాల్చుకున్నాడు.
ఈ తరహా దందాలే వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు కూడా మైనస్ అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవే విమర్శలు ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ కీలక మంత్రి నియోజకవర్గంలోనే ఇలా చేస్తుండడం.. సద రు మంత్రి సైతం ఆ పాపం నాది కాదని చేతులు దులుపుకోవడం.. మరోవైపు అక్రమార్కులు రెచ్చిపోతుం డడం వంటివి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిత్యకృత్యంగా మారాయి. పైగా ప్రశ్నిస్తున్నవారిని బెదిరిస్తున్న వైనం కూడా కనిపిస్తోంది. మరి ఇలాంటి ఆగడాలను కఠినంగా అడ్డుకోకపోతే.. చంద్రబాబుకు బ్యాడ్ నేమ్ తప్పదని అంటున్నారు పరిశీలకులు.