16 వేల మంది డిపోర్టేషన్... కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన అక్రమ వలసదారుల ఏరివేత ప్రపంచం అంతటా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sept 2025 2:46 PM ISTఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన అక్రమ వలసదారుల ఏరివేత ప్రపంచం అంతటా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా భారతీయులను సైతం ట్రంప్ స్వదేశానికి పంపించేశారు. అక్రమ వలసదారులని తేల్చిన నేపథ్యంలో దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ట్రంప్ తరహాలోనే భారత్ కూడా అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టింది.
తాజా చట్టం ఆధారంగా...
కొద్ది రోజుల కిందట కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం దేశంలో అక్రమంగా ఉంటున్న 16 వేల మంది విదేశీయులను బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందట. వీరంతా నార్కొటిక్స్ రవాణా సహా పలు నేరాలతో సంబంధం ఉన్నవారే. పలుప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వీరందరిని దేశం నుంచి బహిష్కరించేందుకు హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కఠిన శిక్షలే...
ఈ నెల 2న అమల్లోకి వచ్చిన కొత్త చట్టం పేరు వలసలు, విదేశీయుల చట్టం-2025. దానిప్రకారం.. ఫోర్జరీ పత్రాలతో భారత్ లో అక్రమంగా నివాసం ఉంటున్నవారిపై కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆమోదించగా, ఏప్రిల్ 4 రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. అప్పటివరకు ఉన్న నాలుగు పాత చట్టాలు రద్దయి వలసలు- విదేశీయుల చట్టం అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం.. తప్పుడు ధ్రువపత్రాలతో భారత్ లోకి వచ్చిన విదేశీయులకు కనిష్ఠంగా రెండేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్ల జైలు, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే చాన్సుంది.
అక్రమ వలసలు ఎక్కడైనా చేటే
ఇటీవల యూకేలో, ఆస్ట్రేలియాలో వలసలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అయితే, ఇందులో సక్రమంగా దేశానికి వచ్చినవారినీ కలపడం గమనార్హం. ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టినది మాత్రం అక్రమ వలసదారుల ఏరివేత. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు అయినా అక్రమ వలసలు పెద్ద తలనొప్పే. ఇలా వచ్చినవారు సహజంగానే పేదలు అయి ఉంటారు. వీరంతా ఆయా దేశాల ప్రభుత్వాలు చేపట్టే పథకాలను పొందుతుంటారు. స్వదేశానికి చెందిన పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా పోతాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులపై కీలక చర్యలకు సిద్ధం అవుతోంది.
