Begin typing your search above and press return to search.

దేశంలోనే నంబర్‌ వన్‌ విద్యా సంస్థకు ఎందుకీ పరిస్థితి!

అలాంటి దిగ్గజ సంస్థ ఐఐటీ బాంబేలో ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 April 2024 1:30 PM GMT
దేశంలోనే నంబర్‌ వన్‌ విద్యా సంస్థకు ఎందుకీ పరిస్థితి!
X

దేశంలోనే ఇంజనీరింగ్‌ కు నంబర్‌ వన్‌ విద్యా సంస్థ ఏదంటే అందరూ చెప్పేమాట.. ఐఐటీ బాంబే. ప్రపంచంలోనే టాప్‌ 200 విద్యా సంస్థల్లో ఇండియా నుంచి చోటు దక్కించుకుంటున్న సంస్థ కూడా ఇదే. ఏటా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తొలి ప్రాధాన్యం కూడా ఐఐటీ బాంబేనే. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లో చేరడమే తమ తొలి ప్రాధాన్యమని జేఈఈ ఆలిండియా టాపర్లు వెల్లడిస్తుంటారు. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఏడాదికి కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు ఖాయమనే నమ్మకమే ఇందుకు కారణం.

అలాంటి దిగ్గజ సంస్థ ఐఐటీ బాంబేలో ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు ఏటా డిసెంబర్‌ నుంచి మరుసటి ఏడాది ఫిబ్రవరి వరకు క్యాంపస్‌ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగాలు దక్కలేదనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. ఐఐటీ బాంబేలో ఏటా నూటికి నూరుశాతం అందరికీ మంచి వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తుంటాయి. ఏటా వందలాది అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ కంపెనీలు స్వయంగా ఐఐటీ బాంబేకు వచ్చి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నాయి.

అయితే గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏకంగా 36 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదనే వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సంవత్సరం ఐఐటీ బాంబేలో 2024 ప్లేస్మెంట్ల కోసం నమోదు చేసుకున్న 2,000 మంది విద్యార్థులలో 712 మంది (36 శాతం) ఆశావహులు ఇప్పటికీ జాబ్‌ ఆఫర్‌ల కోసం ఎదురు చూస్తున్నారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్లేస్మెంట్‌ సీజన్‌ మే నెల నాటికి ముగియనుండడంతో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించాయి.

మొత్తం మీద ఈ సీజన్‌లో ఉద్యోగాలు లేకుండా మిగిలిపోయిన విద్యార్థుల సంఖ్య 35.8 శాతానికి చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.8 శాతం ఎక్కువని అంటున్నారు.

2023 గణాంకాల ప్రకారం.. ఐఐటీ బాంబేలో 2,209 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉద్యోగాలు పొందారు. మరో 32.8 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదు. 380 కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం రాగా ఇందులో ఎక్కువ శాతం దేశీయ కంపెనీలే కావడం గమనార్హం. కొద్ది సంఖ్యలో మాత్రమే అంతర్జాతీయ కంపెనీలున్నాయి.

ఉద్యోగాలు సాధించనివారిలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కూడా ఉండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. యావరేజ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్సు కోర్సు చేసినా ఉద్యోగం ఖాయం. అలాంటిది ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్సు చేసినవారికయితే కోట్లలో వేతన ప్యాకేజీలు లభిస్తాయి. అలాంటిది కొందరు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్‌ లభించలేదని అంటున్నారు.

కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌ – హమాస్‌ యుద్ధం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ పరస్పర దాడులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్లేస్మెంట్స్‌ తగ్గుదలకు కారణమని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్తవ్యస్త పరిస్థితులతో కంపెనీల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం వల్లే భారీ జీతాలు ఇచ్చి ఉద్యోగులను నియమించుకోవడానికి అవి వెనుకాడుతున్నాయని పేర్కొంటున్నారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సాధారణ కంపెనీలతోపాటు దిగ్గజ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ కారణాల వల్లే కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపడం లేదని అంటున్నారు.

మరోవైపు 36 శాతం మందికి ఉద్యోగాలు రాలేదనే వార్తలను ఐఐటీ బాంబే వర్గాలు ఖండించాయి. కోర్‌ బ్రాంచ్‌ ల్లో ఉద్యోగాలు, భారీ జీతాలను కోరుకోవడం వల్లే విద్యార్థులు తమకు వచ్చిన ఆఫర్లను తిరస్కరించారని చెబుతున్నాయి. నూటికి నూరు శాతం మందికి అవకాశాలొచ్చాయని.. మరింత మెరుగైన ఉద్యోగాలు, జీతభత్యాలను కోరుకున్నవారు తాజా ఆఫర్లను తిరస్కరించారని పేర్కొంటున్నాయి.