Begin typing your search above and press return to search.

బంకమట్టితో కరోనా వైరస్ గుర్తింపు పరీక్ష

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వైరస్‌ను గుర్తించడం, పరీక్షించడం అప్పట్లో ఒక పెద్ద సవాలుగా మారింది.

By:  Tupaki Desk   |   7 Jun 2025 10:00 PM IST
బంకమట్టితో కరోనా వైరస్ గుర్తింపు పరీక్ష
X

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వైరస్‌ను గుర్తించడం, పరీక్షించడం అప్పట్లో ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)-గువాహటి పరిశోధకులు ఒక శుభవార్తను అందించారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకిందా లేదా అని గుర్తించడానికి వారు సులభమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇది వైరస్ నిర్ధారణకు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. దీని కోసం వారు మట్టి కణాలను ఉపయోగించారు.

మట్టి కణాలతో వైరస్ గుర్తింపు ఎలా?

పరిశోధకులు కనుగొన్న దాని ప్రకారం.. కరోనా వైరస్ ఉన్న ఉప్పునీటి ద్రావణంలో ఈ మట్టి కణాలు వేగంగా మార్పులకు లోనవుతాయి. మట్టి కణాలలోని క్లే-ఎలక్ట్రోలైట్ వ్యవస్థలో అవక్షేపణ రేటులో (Sedimentation Rate) మార్పులు వస్తాయని వారు గుర్తించారు. ఈ మార్పుల ఆధారంగా వైరస్‌ను సులభంగా గుర్తించవచ్చని వారు తెలిపారు. ఒకవేళ ఎలాంటి మార్పులు లేకపోతే, వైరస్ సోకలేదని అర్థం. బాధితుల నుండి నమూనాలను (Samples) సేకరించి, ఈ పరీక్షను నిర్వహిస్తే, ఫలితం త్వరగా, స్పష్టంగా వస్తుందని పరిశోధకులు వివరించారు.

పీసీఆర్ పరీక్షలకు ప్రత్యామ్నాయం

ప్రస్తుతం SARS-CoV-2 వైరస్‌ను గుర్తించడానికి పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) టెస్ట్ ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పరీక్షకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా దీనికి భారీ యంత్రాలు, ప్రయోగశాలలు అవసరం. యాంటిజెన్ టెస్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం తక్కువగా ఉంటుంది.

ఐఐటీ-గువాహటి ప్రొఫెసర్ టి.వి. భరత్ మాట్లాడుతూ.. యాంటీబాడీ పరీక్షలకు కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయని అన్నారు. ప్రయోగశాలలు, నిపుణులు, వనరులు లేని ప్రదేశాలలో ఈ రకమైన పరీక్షలు చేయలేమని, కాబట్టి మట్టి కణాలను ఉపయోగించి వైరస్‌ను గుర్తించడం మంచి ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన తెలిపారు. ఈ పద్ధతి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుందని ఆయన వెల్లడించారు.ఈ పరీక్ష కోసం పరిశోధకులు బంకమట్టిని ఉపయోగించారు. ఈ మట్టికి ఒక ప్రత్యేకమైన రసాయన నిర్మాణం ఉంది. ఇది కాలుష్య కారకాలను, భారీ లోహాలను సులభంగా శోషించుకోగలదు. మట్టి కణాలు వైరస్‌లను శోషించుకుంటాయి. అందుకే వైరస్‌ల ఉనికిని గుర్తించడానికి మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి.