అమ్మానాన్న పై ప్రేమతో.. ₹2.90 కోట్ల జీతాన్ని వదిలేసిన ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్
కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ అనే యువకుడు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా.. అసలైన విజయానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. కళ్లముందు కనిపిస్తున్న కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కాలదన్ని, కన్నవారి కోసం కరిగిపోయే ఒక హృదయాన్ని ఆవిష్కరించారు.
By: A.N.Kumar | 5 July 2026 11:33 AM ISTఈ ఆధునిక ప్రపంచంలో గెలుపు అంటే ఏమిటి? బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమా? విదేశాల్లో లగ్జరీ జీవితం గడపడమా? లేక సమాజంలో హోదాను సంపాదించుకోవడమా? చాలా మందికి ఇవే విజయానికి కొలమానాలు కావచ్చు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ అనే యువకుడు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా.. అసలైన విజయానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. కళ్లముందు కనిపిస్తున్న కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కాలదన్ని, కన్నవారి కోసం కరిగిపోయే ఒక హృదయాన్ని ఆవిష్కరించారు.
ఐఐటీ గోల్డ్ మెడల్ నుండి రూ. 2.90 కోట్ల ఆఫర్ వరకు..
చిన్నప్పటి నుంచే చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన వివేక్ శర్మ, దేశంలోనే నెంబర్ వన్ విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అంతేకాదు తన అసాధారణ ప్రతిభతో అక్కడ గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. ఒక మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇంతకంటే ఏం కావాలి? కొడుకు సాధించిన విజయానికి ఆ కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి.
ఆయన మేధస్సుకు దాసోహమైన ఒక ప్రముఖ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఏకంగా ఏడాదికి ₹2.90 కోట్ల భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. విదేశాల్లో స్థిరపడే అవకాశం, చేతినిండా కోట్లు, విలాసవంతమైన జీవితం.. ఒక సామాన్య యువకుడి కలలన్నీ నిజమయ్యే క్షణమది. కానీ సరిగ్గా అదే సమయంలో విధి ఆయన జీవితంలో అత్యంత కఠినమైన పరీక్షను ఎదురు నిలిపింది.
గుండెను పిండేసిన విధి వైపరీత్యం
ఒకవైపు అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా వివేక్ తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ నివ్వెరపాటు నుంచి కోలుకోకముందే కన్నతల్లికి క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా ఆ కుటుంబంపై చీకట్లు ముసిరాయి. ఆ క్షణంలో వివేక్ ముందు రెండు దారులు ఉన్నాయి. కోట్ల రూపాయల జీతంతో అమెరికా వెళ్లి, అక్కడి నుండి డబ్బులు పంపిస్తూ తల్లిదండ్రులకు వైద్యం చేయించడం. ఆ బంగారు భవిష్యత్తును అక్కడికక్కడే వదిలేసి.. కన్నవారి పక్కన ఉండి ప్రాణంలా కాపాడుకోవడం. "నాకు జన్మనిచ్చి, నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి తమ జీవితాలనే త్యాగం చేసిన అమ్మానాన్నల కంటే నాకు ఏ ఉద్యోగమూ, ఏ డబ్బూ ఎక్కువ కాదు." అని వివేక్ శర్మ నిర్ణయించుకున్నాడు. ఆయన రెండో దారినే ఎంచుకున్నారు. ఆ ₹2.90 కోట్ల ఆఫర్ లెటర్‌ను పక్కనబెట్టి, తన ప్రపంచమైన తల్లిదండ్రుల చెంతనే ఉండిపోయారు.
కిరాణా దుకాణం నిర్వాహకుడిగా.. సమాజానికి వెలుగై..
ప్రస్తుతం వివేక్ శర్మ తన స్వస్థలంలో ఉంటూ కుటుంబానికి చెందిన ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ కిరాణా కొట్టులో కూర్చోవడమా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు, కానీ వివేక్ ముఖంలో ఎలాంటి అశాంతీ లేదు. తల్లికి సమయానికి మందులిస్తూ.. తండ్రికి ఆసరాగా నిలుస్తూ ఆ కళ్లలో కనిపిస్తున్న తృప్తే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తి.
అయితే ఆయన తనలోని ప్రతిభను వృధా పోనివ్వలేదు. తన సంపాదన మార్గాన్ని త్యాగం చేసినా, తన జ్ఞానాన్ని సమాజానికి పంచుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన, కోచింగ్ ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు ఉచితంగా కోడింగ్ శిక్షణ ఇస్తున్నారు. వివేక్ వద్ద ఉచితంగా నేర్చుకున్న ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించి, వారి కుటుంబాలను పేదరికం నుండి గట్టెక్కిస్తున్నారు.
నేటి తరానికి ఒక కనువిప్పు
ఈ రోజుల్లో కెరీర్ పేరుతో, ప్యాకేజీల వేటలో పడి కన్నవారిని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న వారు కొందరైతే.. ఫోన్ కాల్స్‌కే పరిమితమవుతున్న వారు మరికొందరు. అలాంటి ఈ కాలంలో, వివేక్ శర్మ కథ ప్రతి ఒక్కరి గుండెను తాకుతుంది.
డబ్బు ఈరోజు రావచ్చు.. రేపు పోవచ్చు.. కానీ అమ్మానాన్నలు ఒక్కసారి దూరమైతే మళ్లీ రారు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ కంటే, తల్లిదండ్రుల ముఖంలో చూసే చిరునవ్వే నిజమైన విజయమని నిరూపించిన వివేక్ శర్మ.. నిజంగా నేటి తరానికి ఒక ఆదర్శమూర్తి, ఒక రియల్ హీరో!
