Begin typing your search above and press return to search.

బాయ్స్ హాస్టల్ లో విద్యార్థినిపై అత్యాచారం!... ఐఐఎంలో ఏం జరిగింది?

ఇటీవల సౌత్ కలకత్తా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 July 2025 1:37 PM IST
బాయ్స్ హాస్టల్ లో విద్యార్థినిపై అత్యాచారం!... ఐఐఎంలో ఏం జరిగింది?
X

ఇటీవల సౌత్ కలకత్తా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో... కాలేజీ క్యాంపస్ లలో అమ్మాయిల భద్రతపై చర్చ తీవ్రంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఘటనను దాదాపు దగ్గరగా మరో ఘటన జరిగింది. ఇందులో భాగంగా.. కోల్ కతా ఐఐఎంలో క్యాంపస్ లో అత్యాచారానికి గురైనట్లు విద్యార్థిని ఫిర్యాదు చేసింది.

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - కోల్ కతాలో చదువుతున్న ఒక విద్యార్థినిపై కాలేజ్ హాస్టల్‌ లో విద్యార్థి ఒకరు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు శనివారం తెలిపారు. ఐఐఎం - కోల్ కతా బాయ్స్ హాస్టల్ లో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. దీంతో.. ఆ విద్యార్థిని హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... నిందితుడు తనను కౌన్సెలింగ్ సెషన్ కోసం ఐఐఎం క్యాంపస్ కు పిలిచాడని ఆమె ఆరోపించింది. తమ ఇద్దరికీ ఓ పని విషయంలో కొన్ని రోజుల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. ఈ సమయంలో... తనను కౌన్సెలింగ్ ప్రాంతానికి తీసుకెళ్లే ముందు, ఏదో తీసుకురావాలని చెప్పి బాయ్స్ హాస్టల్‌ కు తీసుకెళ్లాడని తెలిపింది!

అలా హాస్టల్ కు వెళ్లిన తర్వాత అతను పిజ్జా, కూల్ డ్రింక్ ఇచ్చాడని.. డ్రింక్ తాగిన తర్వాత తనకు తల తిరిగినట్లు అనిపించిందని.. ఆ సమయంలో తనకు శారీరకంగా దగ్గరకు రావడానికి ప్రయత్నించాడని.. ప్రతిఘటించి అతడిని చెంపదెబ్బ కొట్టడంతో.. దీనికి ప్రతిస్పందనగా జుట్టు పట్టుకుని లాగి, తలను గోడకు కొట్టి, అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది!

తిరిగి సృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు తాను గ్రహించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొందని అంటున్నారు! ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా బెదిరించాడని ఆమె ఆరోపించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.