Begin typing your search above and press return to search.

క్యాప్షన్ చూడకుండా ఈ వీడియో చూస్తే తప్పులో కాలేస్తారు

ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఉన్నదెవరు? ఏ దేశానికి చెందిందన్నది చూస్తే.. న్యూజిలాండ్ పార్లమెంటులో ఒక యంగ్ ఎంపీ తమ సంప్రదాయ గీతాన్ని ఆలపించారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:35 AM GMT
క్యాప్షన్ చూడకుండా ఈ వీడియో చూస్తే తప్పులో కాలేస్తారు
X

ఎలాంటి క్యాప్షన్ చదవకుండా.. ఈ వీడియోను చూస్తే.. ఎవరీ అమ్మాయి? ఎందుకంత ఆవేశం? ఏ సందర్భంలో ఆమె ఇలా వ్యవహరించిందని అనుకుంటామే తప్పించి.. ఆమె చేసిన పనిని అర్థం చేసుకోవటం వెయ్యిలో ఒక్కరికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ అంత ఆగ్రహంతో.. ఆవేశంలో స్పీచ్ ఇస్తుంటే.. వెనుక నుంచి అంత కోరస్ గా ఆమెకు జతగా అంత మంది వచ్చే వారు కాదు. ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఉన్నదెవరు? ఏ దేశానికి చెందిందన్నది చూస్తే.. న్యూజిలాండ్ పార్లమెంటులో ఒక యంగ్ ఎంపీ తమ సంప్రదాయ గీతాన్ని ఆలపించారు.

పార్లమెంటులో అడుగుపెట్టిన 21 ఏళ్ల యువ ఎంపీ మైపి క్లార్క్. న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో 170 ఏళ్ల తర్వాత అత్యంత చిన్న వయసులో పార్లమెంటులో గెలిచిన ఎంపీగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఆమె న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా బిల్లును వ్యతిరేకిస్తూ.. తన స్థానిక భాషలో అత్యంత పాపులర్ అయిన సంప్రదాయ గీతాన్ని ఆలపించటం ద్వారా.. ఆమె తన వాదనల్ని వినిపించే ప్రయత్నం చేశారు. తీవ్రమైన భావోద్వేగంతో ఆమె ఆలపించిన ఈ గీతానికి సంబంధించిన వీడియో ఆ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.ఆమె తీరుకు పెద్ద ఎత్తున సానుకూల స్పందనలు రావటమే కాదు.. ఆమె గురించి తెలుసుకునే ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఆమె ఆ తీరులో ఎందుకు రియాక్టు అయ్యారన్న విషయంలోకి వెళితే.. న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతి ఆధారంగా కాకుండా ప్రజల అవసరాల ఆధారంగా విదానాల్ని మార్చాల్సిన అవసరంఉందని.. ఇందుకు 12 చట్టాలకు సవరణ చేయాల్సి ఉందంటూ పార్లమెంటులో ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును మావోరీ ప్రాంతానికి చెందిన యువ ఎంపీ వ్యతిరేకించారు. తన ప్రసంగంలో భాగంగా సంప్రదాయ గీతాన్ని స్థానిక భాషలో ఆలపించి.. సభలో మిగిలిన సభ్యుల్ని గొంతు కలిపేలా చేయటంతో పాటు.. భావోద్వేగంతో పలువురిని కనెక్టు అయ్యేలా చేశారు.

మావోరీ ప్రాంతానికి చెందిన ప్రజలకు పన్నెండు అంశాల్లో నిధుల కేటాయింపు.. విద్య.. వైద్యం.. కనీస అవసరాలు.. ప్రబుత్వ విధానాల్లో ప్రత్యేక కోటా ఉండేది. అయితే.. తాజాగా వాటిని మారుస్తూ.. జాతి ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్లు లేకుండా ప్రజల అవసరాలు.. వారి ఆర్థిక అవసరాల ఆధారంగా నిర్ణయాలు ఉండాలన్న ఉద్దేశంతో కొత్త బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టింది అధికార పక్షం. దీనికి యువ ఎంపీ వ్యతిరేకించారు.

ఆమె భావోద్వేగంతో ఆలపించిన పాపులర్ పాట ఆర్థం ఏమంటే.. ‘‘మీ కోసం నేను చచ్చిపోతాను. ఈ నేల కోసం.. ఈ చెట్టు కోసం.. ఈ నేచర్ కోసం.. నా అమ్మభాష కోసం చచ్చిపోతాను’’ అని పేర్కొన్నారు. ఆమె ప్రసంగంలో మరింత భావోద్వేగంతో నిండి ఉంది. ‘‘ఈ సభలో ఇవాళ ఉంటాను. రేపు ఉండకపోవచ్చు. ఇవాళ నేను బతికి ఉన్నాను. రేపు ఈ భూమిపై ఉండకపోవచ్చు. నా భాష ఉంటుంది. నా నేల ఉంటుంది. నా చెట్లు ఉంటాయి. నా జాతి ఉంటుంది’’ అంటూ ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు అందరిని ఊగిపోయేలా చేశాయి. ఆమె హావభావాలు.. తన జాతి పట్ల.. తన ప్రజల పట్ల ఈ యంగ్ ఎంపీకున్న కమిట్ మెంట్ ప్రపంచ వ్యాప్తంగా పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది.