ఆంక్షల దిగ్బంధనంలో విశాఖ...ఐఎఫ్‌ఆర్‌కు కౌంట్ డౌన్
విశాఖలో ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్‌ఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
By: Satya P | 17 Feb 2026 8:45 AM ISTవిశాఖలో ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్‌ఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విశాఖకు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు అంతా తరలివస్తున్న వేళ ఆంక్షల వలయంలోనికి నగరం వెళ్ళిపోయింది. తూర్పు నౌకాదళం విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి..ఐఎఫ్‌ఆర్ ని తిలకించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ రానున్నారు. రాష్ట్రపతి విశాఖలో రెండు రోజుల పాటు బస చేస్తారు.
అద్భుతమైన విన్యాసాలు :
ఇక ఈ నెల 18, 19 తేదీలలో విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా భారీ ఎత్తున అంతర్జాతీయ నావికా దళ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17న నగరానికి చేరుకుంటారు. ఆమె 18వ తేదీన యాంకరేజ్ ఏరియాలో జరిగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్‌ని సమీక్షించనున్నారు. దాదాపు 70 దేశాలకు చెందిన 50 యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్లుతో పాటు భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు, సీకింగ్స్, హెలికాఫ్టర్లు ఐఎఫ్‌ఆర్, మిలాన్‌లో భాగస్వామ్యం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అదే విధంగా భారీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ తో పాటు భారతీయ నావికాదళ చరిత్రని గుర్తు చేసేలా రూపొందించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అందరూ విశాఖలోనే :
రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలో ఉంటారు. ఆమెకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ విశాఖ నగరానికి చేరుకుని రెండు రోజుల పాటు బస చేస్తారు. 17 వ తేదీ ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ట్వీట్ విందులో ఆయన పాల్గొంటారు. 18న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ లో కూడా హాజరవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు అని చెబుతున్నారు.
వేలాదిగా వీక్షకులు :
ఇక ఐఎఫ్‌ఆర్ కార్యక్రమాలను స్వయంగా తిలకించేందుకు విశాఖ నగరవాసులతో పాటు అత్యంత కీలకమైన అధిపతులు, ప్రముఖులు హాజరుకానున్నారు దీంతో అతిథులు, అధికారులు, నగరవాసులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నేవీ యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి. విశాఖ తీరానికి దగ్గరగా చేరడంతో వాటిని తిలకించేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు :
విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిలాన్–2026, అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాలకు రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు విచ్చేస్తున్నందున నగరంలో భారీస్థాయిలో ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. ముఖ్యంగా నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ వరకు నాలుగు రోజుల పాటు సామాన్య వాహనాల రాకపోకలపై భారీ ఆంక్షలు విధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని ప్రధాన మార్గాలలో భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. సాధారణ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
