Begin typing your search above and press return to search.

‘సీఎం’ కాకుంటే.. బీసీలను ఏ పార్టీ నమ్మదు.. రెచ్చగొట్టే బండి ఇది

వాస్తవానికి ఈ రెండు అస్త్రాలు ఏడాది కిందటే చెప్పి ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించకుండా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికను కోరి తెచ్చుకోకుంటే తెలంగాణలో బీజేపీ ప్రబల శక్తిగా ఉండేది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:30 PM GMT
‘సీఎం’ కాకుంటే.. బీసీలను ఏ పార్టీ నమ్మదు.. రెచ్చగొట్టే బండి ఇది
X

తెలంగాణలో సరిగ్గా ఏడాది కిందటి వరకు అధికార పార్టీనీ ఢీకొట్టే స్థితిలో ఉండేది బీజేపీ.. ఇంకాస్త గట్టిగా కష్టపడితే ఫలితం ఏమయ్యేదో కానీ.. మధ్యలోనే అస్త్ర సన్యాసం చేసింది. అదికూడా ఎన్నికల ముంగిట వెనక్కుపోయింది. తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేలోపే నష్టం జరిగిపోయింది. దీంతో రెండు అస్త్రాలను బయటకు తీసింది. మొదటిది వెనుకబడిన వర్గాల (బీసీ) అభ్యర్థిని సీఎం ప్రకటించడం కాగా.. మరొకటి మూడు దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎస్సీ వర్గీకరణ. వాస్తవానికి ఈ రెండు అస్త్రాలు ఏడాది కిందటే చెప్పి ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించకుండా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికను కోరి తెచ్చుకోకుంటే తెలంగాణలో బీజేపీ ప్రబల శక్తిగా ఉండేది. కానీ, ఈ మూడు తప్పులూ చేసింది. ముక్కోణపు పోటీ ఉంటుందని ఆశించిన చోట కమలానికి మూడో స్థానమూ (సీట్ల పరంగా) దక్కేలా లేదు.

మతం వదలి.. కులం బాట

పైకి ప్రకటించకున్నా బీజేపీ శ్వాస, ధ్యాస.. హిందూత్వమే. హిందూ ధర్మ పరిరక్షణకు ఉద్భవించిన పార్టీగా చాలామంది ఇప్పటికీ భావిస్తుంటారు. అయితే, కాషాయ పార్టీలో మతం కంటే కులానికి ప్రాదాన్యం తక్కువ. హిందూత్వ కోణంలో దేశం ప్రధానం.. అనేది వారి ఉద్దేశం. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం హిందూత్వం కంటే సామాజికంగా కీలకమైన కులం అనే అంశాన్నే ఎంచుకుంది. ఈ కోణంలో వచ్చినవే.. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ హామీలు. సామాజికంగా రెండు కీలకమైన హామీలైన వీటిని ప్రయోగించిన బీజేపీ.. సరిగా వాడుకోవడంలో విఫలమైంది.

కీలకమే కానీ..

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు బీసీ నాయకుడు ఎవరూ సీఎం కాలేదు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ బీసీలు అధికార పీఠానికి చేరువ కాలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటీ రెండుసార్లు అవకాశం వచ్చి చేజారింది. అందుకనే బీసీ సీఎం అనే హామీ ఇచ్చింది బీజేపీ. కాగా, ఈ హామీని నమ్మి బీసీలు బీజేపీని గట్టిగా ఆదరించాలని కోరుతున్నారు ఆ పార్టీ రాష్ట్ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. స్వయంగా బీసీ అయిన సంజయ్ ను తప్పించే బీజేపీ మరొకరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయినా, తమ పార్టీ హామీ బీసీ సీఎంను నమ్మాలని పిలుపునిస్తుండడం గమనార్హం.

హెచ్చరిక లాంటి సూచన..

సీఎం చేస్తామని చెప్పినా బీసీలు ఈసారి ఓటేయయకుంటే మరే పార్టీ వారిని నమ్మదంటూ హెచ్చరికతో కూడిన సూచన చేశారు సంజయ్. తెలంగాణలో ఇప్పటికే మూడో నాలుగో స్థానంలోకి వెళ్లిపోయిన బీజేపీని పైకి లేపే ప్రయత్నమే ఇదని విమర్శకులు అంటున్నారు. మరోవైపు సంజయ్ హిందూత్వ కోణంలోనూ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ అయితే ఏడాది కిందటే ఇవ్వాల్సిందని గుర్తుచేస్తున్నారు. కాగా, 2014లో టీడీపీ సైతం బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత వైసీపీ ఎంపీ ఆర్. క్రిష్ణయ్యకు ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఆయన గెలిచినా పార్టీ ఓడింది. అలా.. బీసీ సీఎం హామీ అటకెక్కింది.