Begin typing your search above and press return to search.

తెలంగాణాలో హంగ్ వస్తే కింగ్ ఎవరు...?

కొన్ని సర్వేలు మాత్రం సింపుల్ మెజారిటీ ఇస్తే మరికొన్ని సర్వేలు 50 నుంచి అరవై సీట్ల మధ్యలో ఉంచేశాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2023 5:11 AM GMT
తెలంగాణాలో హంగ్ వస్తే కింగ్ ఎవరు...?
X

తెలంగాణాలో హంగ్ వస్తుందా. ప్రస్తుతం దీని మీద కూడా హాట్ గా చర్చ సాగుతోంది. హంగ్ వస్తే ఏ రాజకీయ పార్టీకి లాభం ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ కి మొగ్గు అని అనేక సర్వేలు చెబుతున్నా అదే సమయంలో మెజారిటీ విషయంలో అస్పష్టత కొనసాగిస్తూ వస్తున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం సింపుల్ మెజారిటీ ఇస్తే మరికొన్ని సర్వేలు 50 నుంచి అరవై సీట్ల మధ్యలో ఉంచేశాయి.

ఇక అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్ట్స్ చూశాక అర్ధమయింది ఏంటి అంటే బీయారెస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 కి తగ్గవని. అంటే ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైనా కూడా బీయారెస్ కి ఈ నంబర్ ఫిక్స్ అన్న మాట. అదే నిజం అయితే మరి మిగిలిన వాటిలో ఎటూ ఏడు సీట్లకు తగ్గకుండా మజ్లీస్ పార్టీ గెలుస్తుంది. అదే విధంగా బీజేపీకి అరడజన్ నుంచి పది దాకా సీట్లు దక్కవచ్చు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

అంటే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలీ అంటే కచ్చితంగా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోవాలి. అదే బీయారెస్ యాభై సీట్లు సాధిస్తే చాలు అధికారాన్ని ఎలాగైనా అందుకుంటుంది అని అంటున్నారు. ఒకసారి అధికారంలోకి వస్తే ఎటూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు అన్నది తెలిసిందే. ఇక బీయారెస్ కి సీట్లు తక్కువ పడితే కింగ్ మేకర్ పాత్రకు మజ్లీస్ పార్టీ ఇప్పటికే రెడీగా ఉంది.

ఆ పార్టీకి వచ్చే సీట్లు అన్నీ తులాభారంగా ఎటూ నిలుస్తాయి. మరో వైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్నపుడు ఓటర్ల మూడ్ చూశాక కాంగ్రెస్ కంటే కేసీయార్ పాలన నయం అని పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే బాహాటంగా ఇదే విషయం చెప్పారు కూడా.

అంటే కాంగ్రెస్ ని నిలువరించేందుకు చివరి నిముషంలో బీజేపీ బీయారెస్ కి మద్దతు ఇస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణా రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. బీజేపీ కూడా తాము కింగ్ మేకర్ పాత్ర పోషించాలని ఉబలాటపడుతోంది అని అంటున్నారు. అదే విధంగా ఎలాగైనా అధికారంలోకి మేము వస్తామని బీజేపీ నేతలు చెప్పడం వెనక హంగ్ రావాలని తాము కింగ్ మేకర్ కావాలన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి డిసెంబర్ 3న వెలువడే తెలంగాణా ఫలితాలలో అనేక సంచలనాలు నమోదు అయ్యేలాగానే ఉన్నాయి. అయితే అండర్ కరెంట్ గా కాంగ్రెస్ వేవ్ కనుక బలంగా ఉంటే మాత్రం వన్ సైడెడ్ గానే కాంగ్రెస్ కి జనాలు జై కొడతారు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.