తప్పుగా ఇండియా మ్యాప్... క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది.
By: Tupaki Desk | 14 Jun 2025 5:20 AMఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ సమయంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ కూడా దాదాపు అదేస్థాయిలో ప్రతిదాడులు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఓ పోస్ట్ పై భారతియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సైన్యం క్షమాపణలు చెప్పింది.
అవును... పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది, అందులో ఓ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు, వాటితో ఉన్న దూరాన్ని వివరిస్తూ ఓ మ్యాప్ ను పోస్ట్ చేసింది! అయితే.. ఆ మ్యాప్ ఫోటోలో జమ్మూకశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంలో ఉన్నట్లు తప్పుగా చూపించింది. దీంతో.. భారతీయులు భగ్గుమన్నారు. వెంటనే ఐడీఎఫ్ సారీ చెప్పింది.
“ఇరాన్ కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు.. ఇది ఆరంభం మాత్రమే.. ఆ దేశం ప్రపంచం మొత్తానికే పెనుముప్పు. ఇప్పుడు మాకు మరో అవకాశం లేదు” అని ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా రాసుకొస్తూ.. సరిహద్దులను తప్పుగా చూపించే ఓ మ్యాప్ ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలోనే భారత మ్యాప్ ను తప్పుగా చూపించింది. ఇందులో భాగంగా.. జమ్మూకశ్మీర్ పాక్ లోని భూభాగంలో చూపిస్తున్నట్లుగా ఉంది.
దీంతో... భారతీయ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను వివరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమే అని.. అందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశ సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైందని తెలిపింది. అనంతరం ఈ తప్పిదానికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని వివరించింది.