Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ పై దాడి చేస్తే నాశనమే... ఇది తాజా ఉదా.!

అవును... హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేసిన హుతీ రెబల్స్ పై ఐడీఎఫ్ విరుచుకుపడింది.

By:  Tupaki Desk   |   29 May 2025 4:00 AM IST
ఇజ్రాయెల్  పై దాడి చేస్తే నాశనమే... ఇది తాజా ఉదా.!
X

ఇజ్రాయెల్ పై దాడి చేస్తే.. ఇక వారిని పూర్తిగా నాశనం చేసే వరకూ ఆ దేశం విశ్రమించడం లేదు! ఈ విషయంలో పూర్తి అనుభవం హమాస్ ఉగ్రవాదులు, గాజా ప్రజలకు అయ్యిందనే చెప్పాలి! తమ దేశ పౌరులను ఊచకోత కోసినందుకు ప్రతీకారంగా గాజాలో హమాస్ చివరి ఉగ్రవాదిని చంపేవరకూ విశ్రమించకుండా ఐడీఎఫ్ విరుచుకుపడుతుంది.

ఇజ్రాయెల్ పై దాడి చేసిన మరుసటి రోజు నుంచి గాజాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వణికించేస్తోంది. గాజా స్ట్రిప్ మొత్తాన్ని కాంక్రీట్ దిబ్బగా మార్చేసింది. ఇక, అక్కడి ప్రజల పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోయింది. ఈ సమయంలో.. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేపట్టిన యెమెన్ లోని హుతీ రెబల్స్ పై ఐడీఎఫ్ కీలక దాడి చేసింది.

అవును... హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేసిన హుతీ రెబల్స్ పై ఐడీఎఫ్ విరుచుకుపడింది. ఇందులో భాగంగా.. యెమెన్ లోని హుతీ రెబల్స్ ఆధీనంలోని సనా ఎయిర్ పోర్టుపై ఇజ్రాయెల్ ఫైటర్లు జెట్లు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్న విమానాలన్నింటినీ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. సనా ఎయిర్ పోర్టులో హుతీ ఉగ్రవాదులే లక్ష్యంగా తమ ఎయిర్ ఫోర్స్ జెట్లు దాడులు చేశాయని.. వారికి ఉన్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయని.. ఇది వారికి స్పష్టమైన సందేశంతోపాటు.. మా పాలసీ ఏమాత్రం మారలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని.. ఇజ్రాయెల్ పై ఎవరు దాడి చేసినవారు భారీ మూల్యం చెల్లించాల్సిందేనని అన్నారు.

వాస్తవానికి ఈ ఏడాది మే నెలలో హుతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో పడ్డాయి. దీంతో.. నాడు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా... సనా ఎయిర్ పోర్టులో హుతీ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జెట్లు దాడులు చేశాయి.. వారికి ఉన్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయి.

దీనికి తోడు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా హుతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. దీంతో.. వీరిపై అమెరికా సంకీర్ణ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెల చివర్లో యెమెన్ కారాగారంపై అమెరికా జరిపిన దాడిలో 68 మరణించగా.. 47 మంది గాయపడ్డారు.