'ఉప్పు' పట్టణాల్లో అంతొద్దు... మెగ్నీషియం కలిపేస్తే సరా?
కానీ... భారతీయులు తింటున్న ఉప్పు మోతాదు చూస్తుంటే మాత్రం నాలుగైదు రకలా అత్యంత కీలకమైన వ్యాధులతో బాధపడేవారిలో మరింత ముప్పు పెరుగుతుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు.
By: Tupaki Desk | 14 July 2025 8:00 AM ISTసాధారణంగా 'ఉప్పు తిన్న విశ్వాసం' అనే మాట భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే... ఉప్పు తింటే విశ్వాసం ఉంటుందో లేదో తెలియదు కానీ... భారతీయులు తింటున్న ఉప్పు మోతాదు చూస్తుంటే మాత్రం నాలుగైదు రకలా అత్యంత కీలకమైన వ్యాధులతో బాధపడేవారిలో మరింత ముప్పు పెరుగుతుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు.
అవును... దేశంలో మోతాదుకు మించి ఉప్పు వినియోగం ఉంటోందని, దీనివల్ల హైపర్ టెన్షన్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడేవారిలో ముప్పు మరింత పెంచుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కు చెందిన 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమిడమాలజీ' (ఎన్.ఐ.ఈ) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా... ఉప్పు వినియోగం తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ సోడియం ఉన్న ప్రత్యామ్నాయ ఉప్పుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... ఉప్పులోని సోడియం క్లోరైడ్ లో కొంతభాగాన్ని పొటాషియం లేదా మెగ్నీషియంతో భర్తీ చేయడం ఆశాజనకంగా కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డా.శరణ్ మురళి పేర్కొన్నారు.
ప్రధానంగా... సోడియం తక్కువ తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె పనితీరు మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారికి ఇది ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా.. రక్తపోటు సుమారు 7/4 ఎం.ఎం.హెచ్.జీ తగ్గుతుందని.. ఈ చిన్న మార్పు చాలా పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
వాస్తవానికి తెలంగాణ, పంజాబ్ లలో మూడేళ్ల వ్యవధితో కూడిన అధ్యయనాన్ని ఐసీఎంఆర్ సాయంతో ఎన్.ఐ.ఈ ప్రారంభించింది. ప్రస్తుతం అధ్యయనం తొలి ఏడాదిలో ఉండగా.. క్షేత్రస్థాయి సన్నద్ధత, అంచనాలపై పనిచేస్తున్నామని డా.గణేశ్ కుమార్ వెల్లడించారు. దీనిపై గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో కలసి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
కాగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నిబంధనల ప్రకారం.. ఓ వ్యక్తి రోజులో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అయితే... భారతదేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు రోజుకు 9.2 గ్రాములు తీసుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ వినియోగం 5.6 గ్రాములుగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల... పట్టణవాసులూ.. ‘ఉప్పు’ అంతొద్దు!
