Begin typing your search above and press return to search.

ఐసీఈ స్పెషల్ ఆపరేషన్: వలసదారులకు అమెరికాలో గడ్డు రోజుల ఆరంభం

సాధారణంగా పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వ్యక్తుల వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే, వారిని యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర జియోలొకేషన్ పరికరాలతో పర్యవేక్షిస్తారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 5:00 AM IST
ఐసీఈ స్పెషల్ ఆపరేషన్: వలసదారులకు అమెరికాలో గడ్డు రోజుల ఆరంభం
X

అమెరికాలో వలసదారులపై ఉక్కుపాదం కొనసాగుతోంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు రికార్డు స్థాయిలో అరెస్టులు నిర్వహించారు. ఒకే రోజు 2,200 మందికి పైగా వలసదారులను అరెస్టు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐసీఈ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా నమోదైంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఇటీవల ఐసీఈ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 3,000 మంది వలసదారులను అరెస్టు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఐసీఈ అధికారులు "ఆల్టర్‌నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ)" ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది.

- ఏటీడీ ప్రోగ్రామ్ లక్ష్యంలో ప్రస్తుత పరిస్థితి:

సాధారణంగా పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వ్యక్తుల వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే, వారిని యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర జియోలొకేషన్ పరికరాలతో పర్యవేక్షిస్తారు. వారు తరచుగా ఐసీఈ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం అధికారులు ఏటీడీలో నమోదైన వలసదారులను ఐసీఈ కార్యాలయాల్లో హాజరుకావాలని పెద్దఎత్తున సందేశాలు పంపిస్తున్నారు. వారు రాగానే అరెస్టు చేసి, బేడీలు వేసి కార్లలో తరలిస్తున్నారు. ఈ అరెస్టులకు గురైన వారిలో చాలామంది అధికారులు నిర్దేశించినప్పుడల్లా గడువు తప్పకుండా ఐసీఈ కేంద్రాల్లో హాజరైన వారే కావడం గమనార్హం. ఇక గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరుకాని వారుంటే మాత్రం, అలాంటివారు డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు.

- ఐసీఈ వివరణ, భయాందోళనలు:

తాజాగా తాము అరెస్టు చేసిన వారిని ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలని ఇమ్మిగ్రేషన్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారని, ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామని ఐసీఈ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలియన్ల కొద్దీ వలసదారులను వెనక్కి పంపించేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఐసీఈకి సాధ్యం కాదని ఆ సంస్థ మాజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీఈ 20,000 యాంకిల్ మానిటర్లను వినియోగిస్తోంది. వీటిని ధరించిన వారందరూ అధికారుల ఎదుట హాజరైనప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఈ చర్యలతో పత్రాలు లేకుండా వచ్చిన చాలామంది వలసదారుల్లో తీవ్ర భయం రేకెత్తుతోంది.