భార్యను.. కూతుర్ని ఐబొమ్మ రవి అలా ట్రీట్ చేసేవాడా?
అతడ్ని విచారించే సమయంలోనే.. విదేశాల్లో ఉన్న అతడి మాజీ భార్యను సైతం పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
By: Garuda Media | 25 Nov 2025 11:37 AM ISTగడిచిన కొన్నిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఐబొమ్మ రవికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలకు అదనంగా అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక అంశాలు బయటకు వచ్చాయి. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు పంపటం.. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించటం తెలిసిందే. సోమవారంతో అతడి పోలీస్ కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే.
అతడ్ని విచారించే సమయంలోనే.. విదేశాల్లో ఉన్న అతడి మాజీ భార్యను సైతం పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐబొమ్మ రవి తీరు.. మైండ్ సెట్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాల్ని ఆమె పోలీసులతో షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కూకట్ పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో 2015లో సొంతిల్లుకొన్న రవి.. దానికి సంబంధించిన ఈఎంఐను తన జీతం నుంచి చెల్లించేవాడు. రెండేళ్ల తర్వాత బ్యాంక్ లోన్ మొత్తాన్ని తీర్చేశాడు.
అదే సమయంలో డబ్బు సంపాదించలేదని తనను మాటలు అనే భార్యను పక్కన పెట్టినట్లుగా గుర్తించారు అంతేకాదు.. కన్నకూతుర్నీ పట్టించుకోలేదని తెలుస్తోంది. 8 నెలల పసికందు అన్నది కూడా చూడకుండా చిన్నారిని కొట్టేవాడని ఐబొమ్మ రవి మాజీ భార్య ఫోన్ లో పోలీసులకు వివరాలు ఇచ్చినట్లుగా సమాచారం. అతడి ప్రవర్తన నచ్చకే విడాకులు తీసుకున్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మరో షాకింగ్ నిజం వెలుగు చూసింది. అదేమంటే.. విడిపోయిన తర్వాత తన భార్యకు.. కుమార్తెకు తాను సంపాదించిన ఆస్తులపై ఎలాంటి హక్కు లేదని భార్యతో ఒప్పందపత్రంపై సంతకం తీసుకున్న తర్వాత విడాకులకు ఓకే చెప్పినట్లుగా గుర్తించారు.
ఇప్పటివరకు ఐబొమ్మ రవిని అతడి మాజీ భార్యే పట్టించినట్లుగా వార్తలురావటం తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని.. అతడి స్నేహితుడ్ని ఫాలో కావటం ద్వారా ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.తాజాగా రవి మాజీ భార్యను ఫోన్ లో ప్రశ్నించటం ద్వారా.. అతడి మైండ్ సెట్ మీద మరికొంత అవగాహనకు వచ్చేలా చేసిందన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
